ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ రాష్ట్రానికి చుట్టం చూపుగా వచ్చిపోతున్నారు. కొద్ది రోజులపాటు ఏపీలో ఉంటూ…ఆ తర్వాత వెంటనే బెంగళూర్ ప్లైట్ ఎక్కేస్తున్నారు. ఎందుకు జగన్ ఏపీలో ఉండేందుకు ఇష్టపడం లేదనే విమర్శలు వస్తున్నా…ఆయన మాత్రం లెక్క చేయకుండా యలహంక ప్యాలెస్ కు చేరిపోతున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయాక జగన్ ఇప్పటికీ తొమ్మిదిసార్లు బెంగళూరు వెళ్లారు. కొద్ది రోజులు ఇక్కడ…మరికొద్ది రోజులు బెంగళూరులో అన్నట్టుగా ఆయన దినచర్య కనిపిస్తోంది. అసలే పార్టీని వరుసగా నేతలు వీడుతున్నారు. మరికొంతమంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. పలు కేసుల్లో వైసీపీ నేతలపై అరెస్టు కత్తి వేలాడుతోంది. ఈ కీలక సమయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన జగన్…నాకేం సంబంధం లేనట్లుగా చీటికిమాటికి బెంగళూరు వెళ్తుండటంపై ఆ పార్టీ నేతలూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆ మధ్య తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్ కార్యాలయం..ఇక నుంచి కార్యకర్తలకు జగన్ నిత్యం అందుబాటులో ఉంటారని అనౌన్స్ చేసింది. అలా ప్రకటించిన కొద్ది రోజులకే జగన్ అనూహ్యంగా బెంగళూరు వెళ్ళారు. ఇప్పుడు వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జగన్ అక్కడ హడావిడి చేసి మళ్లీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు. దీంతో జగన్ వరుస బెంగళూరు పర్యటనలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి.
అయితే, జగన్ వరుసగా బెంగళూరు వెళ్తుండటం వెనక ఏదో పెద్ద తతంగమే నడుస్తోందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.