తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు ఈటల, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ తోపాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జమ్మూ కశ్మీర్ ఎలక్షన్ ఇంచార్జ్ గా నియమించడంతో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ కారణంగానే పార్టీ నేతలు – రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బ తింటుంది అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అధ్యక్ష పదవిపై ఆలస్యం చేస్తే రాష్ట్రంలో పార్టీ పట్టు కోల్పోతుంది అనే బీజేపీ జాతీయ నాయకత్వం గ్రహించినట్లు తెలుస్తోంది.
అందుకే బీజేపీ అధ్యక్ష పదవి ఆశావహులకు హై కమాండ్ బిగ్ టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సభుత్వ నమోదు నడుస్తోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 70లక్షల ఓట్లు రావడంతో…సభ్యత్వ నమోదు కూడా 70లక్షల మార్క్ చేరుకునేలా చొరవ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.
అయితే, రెండు సార్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కు 60లక్షల మంది కార్యకర్తలు ఉండగా…బీజేపీకి 70లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్ విధించడం ఎంటి అని పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. అయితే, అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు ఇది పరీక్ష లాంటిది అని, అందుకే ఈ టాస్క్ అప్పగించింది అనే అభిప్రాయం వినిపిస్తోంది.
అటు హైకమాండ్ ఆదేశాలతో సభ్యత్వ నమోదులో తమదైన మార్క్ వేసి…అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ ను మెప్పించే దిశగా ఇప్పటికే ఆశావహులు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.