గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సార్లు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు, మూడు చోట్ల గెలవడానికి తంటాలు పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఉందో చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు బీఆర్ఎస్కు ఉండేది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండేవారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పోటీ చేయలేపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారం చేతుల్లోకి వచ్చిన తరవాత కేసీఆర్ భిన్నమైన ప్లాన్ తో బీఆర్ఎస్ ను బలోపేతం చేశారు. ఆ ప్లాన్ నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గ్రేటర్ లో బలోపేతం చేసుకునేందుకు వాడేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మొదట … అక్రమ కట్టడాల పేరుతో సెటిలర్ల కాలనీలపై విరుచుకుపడ్డారు. అయితే విస్తృతంగా కాదు. భారీగా ప్రచారం వచ్చే ఒకటి, రెండు చోట్ల మాత్రమే కూల్చివేతలు చేశారు. అందరూ దారికొచ్చారని తెలిసిన తర్వాత ఆపేశారు. ఇప్పుడు రేవంత్ కూడా హైడ్రా పేరుతో అదే హడావుడి చేస్తున్నారు. రేవంత్ ఎన్ని కబుర్లు చెప్పిన అంతిమ లక్ష్యం ఏమిటో ఆయనకు బాగా తెలుసు.. రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఆయన కూడా స్పెసిఫిక్ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు.
తర్వాత కేసీఆర్ మెజార్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. నిజానికి సిటీ ప్రజలకు..తాయిలాలు ఇవ్వడం ద్వారా ఎవరూ ఆకట్టుకోలేరు. భావోద్వేగ అంశం ముఖ్యం. అందుకే కేసీఆర్ తాను ఉన్నానని భరోసా ఇచ్చేలా కొన్ని పరిణామాలు సృష్టించారు. దాంతో మెజార్టీ ఓటర్లు ఆయన వైపు మొగ్గారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యూహాత్మక తప్పిదంతో రేవంత్ కేసీఆర్ ప్లాన్ ను సింపుల్గా అమలు చేసేశారు. శాంతి భద్రతల సమస్య గురించి మాట్లాడారు. అంతే కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడలేదు. కౌశిక్ రెడ్డి, గాంధీ ఇష్యూను రాజకీయంగా కాకుండా జనంతో సంబంధం ఉన్న అంశంగా మార్చారు. ఈ అంశంపై బల్బ్ వెలిగే సరికి బీఆర్ఎస్ కు నష్టం జరిగింది.
రేవంత్ ను ఇప్పటికీ బీఆర్ఎస్ వ్యూహకర్తలు తక్కువగా అంచనా వేస్తున్నారు. అందుకే ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు జరుగుతున్నాయి. ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నరని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూనే వాటిలో భాగమవుతున్నారు. అంటే… రేవంత్ వాళ్లకు చాయిస్ లేకుండా చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.