పంజరంలో చిలుకలా వ్యవహరించవద్దని సీబీఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. సీబీఐ, ఈడీ చివరికి NIA కూడా పంజరంలో చిలుకల్లా అయిపోయాయని అందరికీ తెలుసు. నిజానికి ఆయా వ్యవస్థలను గౌరవించాలని చిలుకలు అంటున్నారు కానీ.. అవన్నీ రాజకీయ బాసులు ఎవర్ని చూపిస్తే వారిని వేటాడటానికి రెడీగా ఉంటాయి. ఇప్పటికే కొన్ని సెలక్టివ్ రాష్ట్రాల్లోనే వాటి హడావుడి ఉండటం దీనికి అసలైన సాక్ష్యం. ఈ విషయం సామాన్యులకు తెలుసు. మరి న్యాయవ్యవస్థకు తెలియదా…?
ఢిల్లీ లిక్కర్ కేసులో ఏళ్ల తరబడి జైళ్లలో ఎలా పెట్టారు ?
ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతి జరిగి ఉండవచ్చు. కానీ దాన్ని రాజకీయంగా వాడుకున్నారన్నది మాత్రం నిజం. నిందితుల్ని సీబీఐ, ఈడీ కేసుల్లో నెలల తరబడి జైల్లో పెట్టారు. వారంతా రాజకీయంగా ఇన్ ఫ్లూయన్స్ ఉన్న వారే. కొంత మందిని వదిలి పెట్టారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడ్ని అరెస్టు చేశారు కానీ ఆయనను అరెస్టు చేయలేదు. ఎందుకలా.. అని సుప్రీంకోర్టు కూడా గతంలో ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థ వద్ద సమాధానం లేదు. ఇలా చెప్పాలంటే ఈకేసులో ఎన్నో లోపాలున్నాయి.
సీబీఐ, ఈడీలకు స్వతంత్రత ఉత్తదే !
సీబీఐ, ఈడీ స్వతంత్రంగా పని చేస్తాయని చెబుతూంటారు. ఆ స్వతంత్రత ఒక్క బీజేపీ నాయకుడి వ్యాపారాలపై సోదాలు చేయడానికి కొరగాదు. కానీ బీజేపీపై విమర్శలు చేసే లేకపోతే పన్ను విధానాలను ప్రశ్నించిన వారిపైనే ఎగబడటానికి ఉంటుంది. నిజంగా దేశంలో అరాచకాలు తగ్గాలంటే.. ప్రతి ఒక్కరికి చట్ట సమానంగా పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే పార్టీయల్ వ్యవస్థతో ప్రజల్లో నమ్మకం పెరగదు. ఇప్పుడు సీబీఐ, ఈడీలను ఎవరూ నమ్మడం లేదు. ఆ సంస్థ తమ జోలికి రాకపోతే మంచిది.. తమ జోలికి వస్తే మాత్రం చెడ్డదన్నట్లుగా రాజకీయ నేతలు ఉంటున్నారు.
ప్రభుత్వం మారితే టార్గెట్లు మారుతాయి !
ఒక వేళ కేంద్రంలో ప్రభుత్వం మారితే ఆటోమేటిక్ గా టార్గెట్లు మారిపోతారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వారు ఎంత బరి తెగించారో తర్వాత వచ్చేవారు అంతకంటే ఎక్కువ తెగిస్తారు. ఎందుకంటే నేర్పారు కదా మరి. ఇలా చేసుకుంటూ పోవడం ఆ వ్యవస్థలు దిగజారిపోతాయి కానీ.. దేశానికి ఏం ప్రయోజనం ఉండదు. వాటిని దారిలో పెట్టాలంటే.. న్యాయవ్యవస్థ క్రియాశీలతే ముఖ్యం. అలాంటి ఆశలు ప్రజలు పెట్టుకోవచ్చో లేదో మరి !