రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలను అట్టుడికేలా చేసిన కౌశిక్ రెడ్డి – అరికెపూడి గాంధీ వివాదంలో బీఆర్ఎస్ ఇక వెనక్కి తగ్గినట్టేనా? ఈ విషయంలో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిందని కేసీఆర్ గ్రహించారా? ఇంతటితో ఈ విషయాన్ని ముగించాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డిల మధ్య కొనసాగిన డైలాగ్ వార్ లో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారాయి. పార్టీ ఫిరాయింపుల విషయం కాస్త కౌశిక్ కామెంట్స్ తో ఆంధ్రా – తెలంగాణ అనే వివాదానికి దారితీశాయి. దీంతో బీఆర్ఎస్ పై ఓ సెటిలర్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవ్వగా.. మరోవైపు కాంగ్రెస్ కూడా దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.
పైగా.. ఈ మొత్తం ఎపిసోడ్ లో గ్రేటర్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కౌశిక్ రెడ్డికి నామమాత్రమైన మద్దతు మాత్రమే దక్కింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని , ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తారా? లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ లు వచ్చాయి. దీంతో ఇక ఈ విషయాన్ని వదిలేయాలని కేసీఆర్ ఆదేశించడంతోనే శుక్రవారం హరీష్ రావు, కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి..ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అంటూ ఎకవాక్యంతో ముగించారు అని అభిప్రాయం వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ఈ విషయంలో ఇంకా రాజకీయం చేయదలిస్తే కారుకు గ్రేటర్ ఎన్నికల్లో ముప్పు తప్పదనే ముందుచూపుతోనే కేసీఆర్ పార్టీ నేతలకు ఈ విధమైన ఆదేశాలు ఇచ్చి ఉంటారని అంటున్నారు.