రాజ్ తరుణ్ నుంచి మరో సినిమా వచ్చింది. అదే భలే ఉన్నాడే. నెల రోజుల వ్యవధిలో రాజ్ తరుణ్ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. అయితే ఏం లాభం…? మూడు సినిమాలూ ఫ్లాపులే. కాకపోతే ‘భలే ఉన్నాడే’పై రాజ్ తరుణ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. మారుతి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సినిమా ఇది. యూత్ కి కనెక్ట్ అవుతుందని, తనకు హిట్ పడుతుందని నమ్మాడు రాజ్ తరుణ్. కానీ.. ఫలితం వేరేలా వచ్చింది.
నిజానికి ఈటీవీ విన్ కోసం తీసిన సినిమా ఇది. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాని తీశారు. కేవలం ఓటీటీలోనే విడుదల చేద్దామనుకొన్నారు. కానీ… థియేటర్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని, థియేట్రికల్ రిలీజ్ ద్వారా మరికొంత ఆదాయం వస్తుందని చిత్రబృందం భావించింది. అందుకే ప్రమోషన్లు కాస్త గట్టిగా చేసి, థియేటర్లలోకి వదిలారు. అయితే ఫలితం మాత్రం నిరాశ పరిచింది. నేరుగా ఓటీటీలో విడుదల చేసినా రాజ్ తరుణ్‌కు ఇంత డామేజీ జరిగేది కాదు. ఎందుకంటే ఓటీటీ సినిమా అనగానే కాస్త మినహాయింపు ఉంటుంది. పెద్దగా అంచనాలు లేకుండానే సినిమా చూడడం మొదలెడతారు. కాబట్టి సినిమా ఎంత నస పెట్టినా ప్రేక్షకులు క్షమించేస్తారు. థియేటర్లలో విడుదల చేస్తే.. సినిమాని చూసే విధానమే మారిపోతుంది. మొత్తానికి వరుసగా మూడో ఫ్లాపుతో హ్యాట్రిక్ కొట్టేశాడు రాజ్ తరుణ్. ఇక రాజ్ తరుణ్ మళ్లీ ట్రాక్ ఎక్కాలంటే ఏదో అద్భుతమే జరగాలి.