సొంత కాలేజీపై విద్యార్థులు ఆరోపణలు చేస్తూంటే.. వారికే మద్దతు పలికారు మంచు మనోజ్. అంతే కాదు.. ఇంకా ఫిర్యాదులు ఉంటే తనకు చెప్పాలని తాను మోహన్ బాబుతో మాట్లాతానని కూడా ప్రకటించారు. ఇప్పటికే కాలేజీపై వస్తున్న ఆరోపణల విషయంలో తాను ఎంబీయూ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వినయ్ నుంచి వివరణ కోరానని కానీ ఇంకా రిప్లయ్ రాలేదన్నారు. దాని కోసం ఎదురు చూస్తున్నానన్నారు.
ఎంబీ యూనివర్శిటీల్లో ఫీజులు, ఇతర ఖర్చుల పేరుతో పిల్లల్ని చెండుకు తింటున్నారని పేరెంట్స్ కమిటీ ఆరోపిస్తోంది. ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఏఐఎస్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటి వరకూ మోహన్ బాబు కానీ.. ఆ కాలేజీ బాధ్యత మొత్తం చూసుకుంటున్న మంచు విష్ణు కానీ స్పందించలేదు. ఆరోపణల విషయంలో అంతా సైలెంట్ గా ఉన్న సమయంలో .. తెరపైకి వచ్చారు. అయితే ఆయన తెలివిగా ట్వీట్ పెట్టారు. తన తండ్రి అత్యంత ఉన్నతమైన ఆశయం, విలువలతో వాటిని పెట్టారని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు విద్యా సంస్థ విష్ణు చూస్తున్నాడు కాబట్టి.. అంతా మోహన్ బాబుకు తెలియకుండా జరుగుతోందని చెప్పడం ద్వారా మనోజ్ కొన్ని లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా విష్ణు ప్రస్తావన తీసుకు రాలేదని కానీ.. విద్యార్థులకు పేరెంట్స్ కు తన మద్దతు ఉంటుందని చెప్పడం మాత్రం చిన్న విషయం కాదు. కుటుంబపరంగా మంచు మనోజ్, విష్ణులకు సరిపడటం లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడీ విద్యా సంస్థ వివాదాలు కూడా అందులో భాగం అవుతాయా లేదా అన్నది.. మనోజ్ ట్వీట్ పై మంచు ఫ్యామిలీ రియాక్షన్ ను బట్టి ఉండొచ్చు.