వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా నిలిచింది. 2014 ,19ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చే సరికి వైట్ వాష్ అయింది. జిల్లాలో పది స్థానాలను టీడీపీ కైవసం చేసుకొని వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.ఎన్నికలకు ముందు ఆ పార్టీ కీలక నేతలంతా సైకిల్ ఎక్కడంతో కంచుకోటలో ఫ్యాన్ పంకలు విరిగిపోయాయి.
అధికారం కోల్పోయాక నెల్లూరు జిల్లాలో వైసీపీ ఉనికిపై నీలినీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లూ వైసీపీని వీడుతున్నారు. నెల్లూరు కార్పోరేషన్ పై టీడీపీ జెండా ఎగరేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. వైసీపీలో ఉండగా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అనిల్ కుమార్ యాదవ్ నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యూహాత్మకంగా పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్న రూప్ కుమార్ యాదవ్ ను మేయర్ గా ఎన్నుకోవాలని కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. రూప్ కుమార్ ఎవరో కాదు.. అనిల్ కుమార్ కు స్వయానా బాబాయ్ కావడం గమనార్హం. ఆయనను మేయర్ చేయడం వలన అనిల్ కుమార్ యాదవ్ ను రాజకీయంగా దెబ్బతీవచ్చుననేది కోటంరెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది.
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ 56 స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగరేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్నారు. ఇప్పటికే నెల్లూరు మేయర్ దంపతులతోపాటు పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా 18మంది కార్పొరేటర్లు వీడుతుండటంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుందన్న ఆందోళన మొదలైంది.