ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ కి సోమవారం బెయిల్ మంజూరయ్యింది. రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేష్ దాఖలు చేసుకొన్న బెయిల్ పిటిషన్లను విచారణకు చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం వారిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరూ చెరో రూ.10,000 పూచీకత్తును చెల్లించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇద్దరూ తప్పనిసరిగా ప్రతీవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరు వేయించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ నెల 3వ తేదీన బంజారా హిల్స్ రోడ్డులో నడుచుకొని వెళుతున్న ఫాతిమా అనే ఒక వివాహిత ముస్లిం అధ్యాపకురాలి పట్ల రావెల సుశీల్ అసభ్యంగా ప్రవర్తించడంతో, స్థానికులు అతనిని, డ్రైవర్ ని చితకబాది పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు వారిరువురిపై నిర్భయ చట్టం క్రింద కేసులు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అంత కటినమయిన చట్టం క్రింద అరెస్ట్ కాబడినప్పటికీ ఇద్దరూ బెయిల్ సంపాదించుకోగలిగారు.