సర్వరకాల బాక్టీరియా ఈ మధ్యనే ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దానికో పేరు కూడా పెట్టుకుని మురిసిపోయాయి. ప్రొగ్రెసీవ్ బాక్టీరియా ఫ్రంట్ అన్న పేరు స్థిరపడగానే బాక్టీరియాలో ఎగురుళ్లూ, గెంతుళ్ళూ…
బాక్టీరియా ఫ్రంట్ తన తొలి మహానాడును రాజమండ్రిలో నిర్వహించుకుని ముచ్చట తీర్చుకున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షులవారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ…
`మనం, అనగా సర్వ రోగ బాక్టీరియా అయిన మనం ఎంతో సంతోషించాల్సిన సుదినం. తొలిసారిగా ఐక్యత సాధించి ఈ కూటమిని ఏర్పాటుచేయగలగడం ముదాహవం. మనలో చాలామంది రాజమండ్రిలోనే ఫ్రంట్ తొలి సమావేశం ఎందుకు పెట్టుకోవాలని నన్ను అడిగారు. మీ అందరికీ తెలుసు, కేవలం కొద్ది రోజుల వ్యవధిలో మన సంఖ్య ద్విగుణీకృతమవడానికి కారణం ఈ రాజమండ్రే. అలాంటప్పుడు ఈ ప్రాంతాన్ని ఎలా మరచిపోగలం చెప్పండి. అందుకే తొలి మహానాడు ఇక్కడే గోదావరి వొడ్డునే పెట్టుకున్నాము. పైగా గోదావరి మహా పుష్కరాలు రావడం మన అదృష్టం. మన జనాభా భారీగా పెరగడానికి కారణమైన ఈ మానవజాతికి థాంక్స్ చెప్పాలి. లక్షల సంఖ్యలో వారు వచ్చి నదీ స్నానాలు చేయడంతో రోగకారకమైన మనలో జీవశక్తి మరింతగా విజృభించింది. అంతే, రెచ్చిపోయాము.
లక్షల కోట్లకు మన జనాభా చేరడం ఓ శుభపరిణామం. ఇందుకు పాలకులకు కూడా థాంక్స్ చెప్పాలి. ఎందుకని? అని మీరు అడగొచ్చు. ఎందుకంటే, బాక్టీరియా అంటే మనం పెరగడానికి చక్కటి పరిస్థితులు కల్పిస్తున్నారు. వారిసహాయసహకారాలు మనకు ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను.
ఎవరో ఈ మధ్య నదిలో నుంచి చాలా కొద్ది నీటిని తీసుకుని పరీక్షించి ఆశ్చర్యపోయాడట. పోడా మరి, ఇప్పుడు మన బలం అంతగా పెరిగిపోతే నోరెల్లబెట్టడూ… సరే, మన వృద్ధి చూసి ఓర్వలేనివారు యాక్షన్ ప్లాన్ అంటున్నారు. మిత్రులారా, వాళ్లు యాక్షన్ కి దిగేలోపే మనం ఈ భూమిమీద మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలి. కొంతమంది మనల్ని టెర్రరిస్టులంటున్నారు. మనం ఎవర్నీ టెర్రర్ కు గురిచేయడంలేదు. వాళ్ల అసమర్థతే మన ఆయుధం. ఆ విషయం వారు గుర్తుపెట్టుకోవాలి.
నేను ఈ సమావేశానికని పరిగెత్తుకుంటూ వస్తుంటే, ఒక మానవుడు అడ్డు తగిలి, `మీరెందుకు ఇక్కడికి ? ‘ అంటూ ప్రశ్నించాడు. ఏం మనలాంటి వాళ్లం నదీ పుష్కర ప్రాంతానికి రాకూడదా ? పుణ్య స్నానాలు చేసే హక్కు వాళ్లకేనా, మనకు లేదా? సదరు పుణ్యమంతా మూటగట్టుకునేది వాళ్లేనా ?? మనకు ఆ అవకాశం ఇవ్వరా ?? అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, అందుకే ఈ సమావేశం తీర్మానించిన మొదటి అంశం, బాక్టీరియా అయిన మనం తండోపతండాలుగా గోదావరి నదీ స్నానం చేద్దాం. మనం సైతం పుణ్యం మూటగట్టుకుందాం. భగవంతుడనేవాడు ఒకడుంటే, ఈ మానవుల్ని ఎలా సృష్టించాడో, మనల్నీ అలాగే సృష్టించాడు. ఆయన దృష్టిలో అంతా సమానమైనప్పుడు ఏక కణంతో ఉన్న మనకు లేని ఆ పుణ్యం, బహుకణసమూహమైన మానవులకు ఎలా వస్తుందని మనం ప్రశ్నించుకోవాలి. పుణ్య స్నానమన్నది కేవలం మానవులకే కాదు, సకలజీవ కోటికని నిరూపించడానికే కదలివచ్చాం. ఇప్పటికే మన దండు చూసి వాళ్లు మూర్ఛపోతున్నారు. ఇది ఆరంభం. ఇక ముందు రచ్చరచ్చే కాచుకోండని వాళ్లకు సవాలు విసురుతూ గోదావరి నదిలోనే తిష్టవేద్దాం. ఎన్ని మునకలేసైనా ఆ పుణ్యాన్ని మూట కట్టుకుందాం. పదండి, ముందుకు, తోసుకుతోసుకు, దూసుకుదూసుకు పోదాం పోదాం గోదాట్లోకి… ‘
ఇలా అధ్యక్షులవారు చెప్పగానే బాక్టీరియా కూటమి సభ్యులంతా `ఛలో గోదావరి…
అంటూ ఎగిరిపోయాయి. గోదావరి నీట్లో కలిసిపోయాయి.
– కణ్వస
kanvasa19@gmail.com