తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల సంగతి రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం కథలా మారింది. గత పది సంవత్సరాల్లో కొత్త కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూశాయి. పెళ్లిళ్లు అయి, పిల్లలు పుట్టి పెరిగి పెద్దవుతున్నా కొత్త కార్డులు లేని వారు ఎందరో. కొత్త ప్రభుత్వంలో అయిన కథ మారుతుందా అంటే ఇప్పుడు కూడా సాగుతూనే ఉంది.
తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల జారీకి వచ్చే నెల అంటే అక్టోబర్ లో దరఖాస్తులు తీసుకుంటామంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసి, కొత్త కార్డులకు అప్లికేషన్స్ తీసుకుంటామని… అర్హులైన వారికి ఇస్తామని తెలిపారు.
నిజానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరగానే ప్రజా పాలన దరఖాస్తులు తీసుకుంది. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు ఇవ్వాలని కోరింది. ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం గ్రామాలకు వెళ్లి, దరఖాస్తులు పెట్టుకున్నారు. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనటంతో ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో తెల్ల కాగితంపై రాసి ఇవ్వండి, అదే దరఖాస్తు… కొత్త రేషన్ కార్డుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఏమీ లేదు అని మంత్రులంతా చెప్పారు. అప్పుడు రాసిచ్చిన కాగితాలు ఇంకా ఎమ్మార్వో కార్యాలయాల్లో ములుగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ దరఖాస్తులు అంటూ మంత్రి ప్రకటించారు.
అప్పుడు తీసుకున్న దరఖాస్తులకే దిక్కులేదు… ఇప్పుడు తీసుకునేవి ఎప్పట్లోగా పరిష్కరిస్తారు? ఎప్పటి లోగా ఇస్తారు? ఏదీ స్పష్టత లేదు. పైగా ఇచ్చే వాటికి ఎన్ని కొర్రీలు పెడుతారో అన్నది మరో మిలియన్ డాలర్ల ప్రశ్న.
మంత్రుల కామెంట్స్, జరుగుతున్న జాప్యం చూసిన వారంతా… అసలు ఈ ప్రభుత్వానికి కూడా కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ఉందా? అని చర్చించుకుంటున్నారు.