కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హత్యాచార కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై విచారణ చేపట్టారు. అయితే జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. మీడియా, పోలీసులు ఆయన్ని సంప్రదించాలని చూస్తే, కనెక్ట్ అవ్వడం లేదు. మరోవైపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి జానీ మాస్టర్ ప్రెసిడెండ్ గా వ్యవహరిస్తున్నారు. జరుగుతున్న వ్యవహారాలపై జానీ మాస్టర్ నుంచి వివరణ కోరుతూ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారా, లేదంటే జానీ మాస్టర్ పై అసోసియేషన్ చర్యలు తీసుకొనే అవకాశం ఉందా? అనే విషయాలు తెలియాల్సివుంది. అధ్యక్ష పదవికి జానీమాస్టర్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈమేరకు కొరియోగ్రాఫర్ సంఘానికి ఆయన సందేశాన్ని పంపినట్టు కూడా తెలుస్తోంది. జనసేన పార్టీ సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొంది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ కేసులో క్లీన్ చీట్ వచ్చేంతవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
నార్సింగ్ పోలీసులకు యువతి ఇచ్చిన ఫిర్యాదులో జానీ మాస్టర్ పై తీవ్రమైన ఆరోపణలే ఉన్నాయి. జానీ మాస్టర్‌కు కొంతకాలంగా సహాయకురాలిగా పనిచేస్తున్నానని, తొలి రోజు నుంచే తనని లైంగికంగా వేధించడం మొదలెట్టాడని, కార్ వాన్లో సడన్ గా వచ్చేసి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, అర్థరాత్రుళ్లు ఇంటి తలుపు తట్టేవాడని, ఓసారి చేయి కూడా చేసుకొన్నాడని, బైకు సైతం ధ్వంసం చేశాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటే ఒత్తిడి తీసుకొచ్చాడని ఈ ఫిర్యాదులో యువతి పేర్కొంది. సెలబ్రెటీ కేసు కాబట్టి పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగి, త్వరితగతిన విచారణ చేపట్టారు. జానీ మాస్టర్ ని విచారిస్తే కానీ, అసలు నిజాలు బయటకు రావు.