ఇండియా – బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో రాబోయే పది టెస్టులు టీమ్ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టుని తేలిగ్గా తీసుకోవడానికి లేదు.
ఇటీవలే పాకిస్థాన్‌ను తన సొంత గడ్డపై ఓడించిన బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఇండియాతో కూడా మరో సంచలనం నమోదు చేయాలనే పట్టుతో వున్నారు బంగ్లా ఆటగాళ్ళు. ఇప్పుడు ఆ జట్టు సమతూకంలో వుంది. సీనియర్లతోపాటు కొత్త కుర్రాళ్లు కూడా అదరగొట్టేస్తున్నారు. పాక్ బలమైన జట్టే. కానీ బంగ్లా ముందు తేలిపోయింది. ఇటు బౌలర్లు, అటు బ్యాటర్లు కలసికట్టుగా రాణించారు బంగ్లా టైగర్స్. వన్డేలో టీమ్ఇండియాని ఓడించిన రికార్డ్ బంగ్లాకి వుంది. టెస్ట్ సిరిస్ క్రికెట్ సిరిస్ పాక్ ని ఓడించిన ఆ జట్టు ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
అయితే ఇండియా లాంటి బలమైన జట్టుని ఓడించడం బంగ్లాదేశ్ కి అంత సులువు కాదు. కాకపోతే ఇండియా కూడా ఆ జట్టుని తేలిగ్గా తీసుకోకూడదు. ఎలాంటి సంచలనానికి చోటివ్వకుండా చిన్నపాముని కూడా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్తతో ఆడాల్సిన బాధ్యత టీమ్ఇండియా పై వుంది. ఇండియా కూడా దాదాపుగా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలో దిగబోతోంది. రోహిత్, కోహ్లీ, రాహుల్, అశ్విన్, బుమ్రా లాంటి అనుభవజ్ఞులతో పాటుగా గిల్, జైస్వాల్, సర్ఫ్రాజ్ ఖాన్చ, ధృవ్ లాంటి యువకులతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.