వైఎస్ వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక ఎప్పుడు ? ఈ అంశం అనే మందికి ఇప్పుడు సందేహంగా మారింది. ఇప్పుడు దర్యాప్తు లేదు.. ట్రయల్ లేదు. నిందితులు మెల్లగా బెయిల్ తెచ్చుకుని బయటపడుతున్నారు. కానీ కేసులో అసలు కదలిక అనేది లేదు. ప్రస్తుతానికి ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. గతంలో ఈ కేసు దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే సీబీఐ ఇంకా తేల్చాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పింది. సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దర్యాప్తు వివరాలన్నీ సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు చేరాయి.
అాలాగే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ దగ్గర నుంచి పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ముందుగా మళ్లీ దర్యాప్తు కొనసాగించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే తప్ప… కేసు ముందుకు సాగదు. ట్రైల్ కూడా జరగదు. ఇప్పటికైతే రొటీన్ గా ప్రతి వారం నిందితులు కోర్టుకు హాజరవుతున్నారు. రాలేని వాళ్లు రాలేకపోతున్నామని పిటిషన్లు వేస్తున్నారు. అయితే.. ఈ కేసుకు ఓ లాజికల్ కంక్లూజన్ తేవాల్సి ఉంది. లేకపోతే వ్యవస్థలపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోతుంది. అవినీతి కేసుల్లాగే.. ఘోరమైన హత్య కేసుల్లోనూ నిందితులు నిర్భయంగా తిరిగితే మొదటికే మోసం వస్తుంది. నేరాలు చేసే వారిలో భయం పోతుంది.
సీబీఐని దర్యాప్తు చేయకుండా అడ్డుకున్న ప్రభుత్వం పోయింది. వైఎస్ వివేకా కుమార్తె న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒత్తిడులు, బెదిరింపులు, ఎదురు కేసులన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డ ఆమె ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఓ వైపు తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందా లేదా అని చూసే ప్రజలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందన్నానిపై అందుకే ఆసక్తి వ్యక్తమవుతోంది.