హైడ్రా ఆగదు… సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తున్న మాటే. అయితే, చెరువుల్లో, బఫర్ జోన్లలో ఇప్పటికే నివాసం ఉంటున్న సామాన్యుల జోలికి వెళ్లము అని హైడ్రా ప్రకటించాక, దూకుడు తగ్గినట్లేనన్న అభిప్రాయం ఏర్పడిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
హైడ్రా కొంతకాలం దూకుడుగా వ్యవహరించింది. సీఎం సొంత అన్నకు సైతం నోటీసులు ఇచ్చింది. అక్రమంగా… నిర్మాణదశల్లో ఉన్న ఇండ్లను కూల్చివేసింది. అయితే, పేదల ఇండ్ల విషయంలో, బఫర్ జోన్లలో ఉన్న ఇప్పటికే నివాసం ఉంటున్న వారిపై హైడ్రా ఫోకస్ చేయదు అని తేల్చటంతో హైడ్రా కోరలు పీకేసినట్లేనన్న అభిప్రాయం వినిపించింది. సీఎం సోదరుడికి నోటీసుతోనే హైడ్రా ఆగినట్లేనని కామెంట్స్ వినిపించాయి.
కానీ, దీనిపై సెప్టెంబర్ 17- ప్రజా పాలన దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. హైడ్రా అనేది ఆగదు. హైడ్రా అంటే భవిష్యత్ హైదరాబాద్ కు గ్యారెంటీ. చెరువులతో గొప్ప చరిత్ర ఉన్న హైదరాబాద్… గత పది సంవత్సరాల పాలనలో ఆగమైపోయింది అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
భూమాఫియా గాళ్లు పేద వారిని అడ్డుపెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు… లేక్ సిటీని కాపాడటమే మా లక్ష్యం అని సీఎం స్పష్టం చేశారు.