జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అవ్వడంతో పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హేమ కమిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి విషయాల్ని సీరియస్ గా తీసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని చిత్రసీమ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. జానీ మాస్టర్ కేసులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొంది.
ఈ కేసు పూర్వాపరాల్ని పరిశీలించడానికి ఛాంబర్ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. రెండు వారాల ముందే ఈ కమిటీ తన పని ప్రారంభించింది. 90 రోజుల లోపు ఈ కమిటీ ఓ నివేదిక సమర్పించనుంది. నిజానికి మీడియాకు వెళ్లకముందే ఈ కేసు ఛాంబర్ ముందుకు వెళ్లింది. ఛాంబర్ పెద్దలంతా కూర్చుని ఈ కేసు కోసం ఓ పరిష్కార మార్గాన్ని అన్వేషించే పనిలో పడింది. చివరికి బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో మీడియాకు పాకింది. లేదంటే ఛాంబర్లోనే ఈ కేసుని గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించేవాళ్లు.
ఇప్పటికే కమిటీ.. అటు బాధితురాలి స్టేట్ మెంట్ తో పాటు ఇటు జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. ఇప్పుడు సాక్షాధారాల్ని సేకరించే పనిలో పడింది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి జానీ మాస్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు. బాధితురాలికి అన్ని రకాలుగానూ అండగా ఉంటామని ఛాంబర్ ధైర్యాన్ని ఇచ్చింది. అంతేకాదు… పరిశ్రమలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఛాంబర్ ని సంప్రదించాలని, తక్షణం చర్యలు తీసుకొంటామని ఛాంబర్ పెద్దలు సూచించారు.
బాధితురాలు కమిటీ ముందు చాలా విషయాల్ని తీసుకొచ్చిందని తెలుస్తోంది. 16 ఏళ్ల సమయంలోనే తనపై లైంగిక దాడి జరిగిందని, డాన్సర్ అసోసియేషన్లో తనకు కార్డు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు గురి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్పైనే కాకుండా మరికొంతమందిపై కూడా బాధితులురాలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వాళ్లందరినీ ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ విచారించబోతోంది. మరోవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా తమదైన శైలిలో విచారణ చేపట్టారు.