ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఓ నిర్ణయానికి వచ్చింది. పలు రాష్ట్రాల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీలు, అక్కడ అమలవుతున్న తీరును సమీక్షించి… కొత్త పాలసీ రూపకల్పన చేపట్టారు.
మంత్రుల సబ్ కమిటీ నిర్ణయాల ప్రకారం…
1. తెలంగాణ తరహాలోనే జిల్లా కలెక్టర్ల ద్వారా కొత్త మద్యం దుకాణాల లాటరీలు తీస్తారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపుల నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు.
2. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ ద్వారానే అమ్మకాలు
3. కొత్త పాలసీలో… నాణ్యమైన, బ్రాండెడ్ మద్యం అందుబాబులోకి తెస్తారు. తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి తీసుకరాబోతున్నారు.
4. గీత కార్మికుల కోసం మద్యం షాపు టెండర్లలో 10శాతం రిజర్వేషన్లు
గతంలో జగన్ ప్రభుత్వం మద్యం అందుబాటులో లేకుండా చేసి మద్యపాన నిషేధాన్ని చేస్తామని తప్పుడు నిర్ణయం తీసుకుందని.. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మద్యం తాగే వారి సంఖ్య పెరిగిందని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. మద్యం అలవాటు ఉన్న వారు అధిక ధరకు కొనుగోలు చేయలేక… గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలకు అలవాటు అయ్యారని, దీని ద్వారా నేరాల రేటు కూడా పెరిగిందని తెలిపింది.
మద్యం అమ్మకాలను నియంత్రిస్తూనే… ప్రభుత్వం పరిమితితో అమ్మకాలు చేస్తూ, డీ అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
బుధవారం జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఏపీ కొత్త ఎక్సైజ్ పాలసీపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.