హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం జోరుగా జరుగుతోంది. ట్యాంక్ బండ్ వద్ద జరిగే నిమజ్జనాన్ని చూసేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జన సందేహంతో కిక్కిరిసిపోయాయి.
మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద జరిగే నిమజ్జనోత్సవాలను చూసేందుకు పెద్దఎత్తున జనం తరలి వస్తారని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు నడుపుతోంది. అయితే.. రోడ్లపై రద్దీ అధికంగా ఉండటంతో మెట్రో రైలు ద్వారా ట్యాంక్ బండ్ వెళ్లేందుకు నగరజనం ఆసక్తి చూపిస్తున్నారు.
దీంతో అన్ని రూట్లలో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. అంతకంతకు జనం ఎక్కువ వస్తుండటంతో మెట్రో ఆధికారులు చేసేదేం లేక స్టేషన్ గేట్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతి పది నిమిషాలకు ఒకసారి గేట్లను ఓపెన్ చేసి..కొంతమందిని లోపలికి పంపుతున్నారు. క్యూలో నిమిషాల కొద్ది వేచి చూడాల్సి వస్తుండటం..పైగా రద్దీ పెరుగుతుండటంతో మెట్రో అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పరిస్థితి కంట్రోల్ తప్పుతుందని మెట్రో అధికారులు పోలీసులకు సమాచారం అందించాల్సి వచ్చింది.
ఇక, నిమజ్జనం సందర్భంగా మెట్రో సర్వీసులను పొడిగించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని, మెట్రో మార్గాల్లోరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు.చివరి మెట్రో ట్రైన్ సెప్టెంబర్ 18న 1AM కు ఉంటుందని తెలిపారు.