జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మళ్లీ చర్చ మొదలైంది. మెల్లమెల్లగా ఒకొక్కరూ తమ గొంతు విప్పుతున్నారు. తాజాగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ పేరుని మళ్లీ బయటకు లాగింది. చాలా కాలం క్రితమే త్రివిక్రమ్ పై తాను ఫిర్యాదు చేశానని, అప్పుడే చర్యలు తీసుకొంటే, ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చేవి కావని, తప్పు చేయాలంటే ఇండస్ట్రీలో భయం పుట్టుకొచ్చేదని పేర్కొంది పూనమ్. జానీ మాస్టర్ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ తీసుకొన్న నిర్ణయాలు, తీసుకొంటున్న చర్యలు స్వాగతించాల్సిందే. తమకేదైనా అన్యాయం జరిగితే ఛాంబర్ అండగా ఉంటుందన్న విషయంలో అమ్మాయిలకు ధైర్యం వచ్చింది. ఈ నేపథ్యంలో పాత కేసులు మళ్లీ తిరిగితోడే అవకాశాలూ కనిపిస్తున్నాయి. పూనమ్ ట్వీట్ ని ఈ కోవలోనే చూడొచ్చు.
చిత్రసీమలో లైంగిక వేధింపులకు సంబంధించిన చర్చ ఇప్పటికి కాదు. ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనిపై ఎవరూ పెద్దగా స్పందించేవాళ్లు కాదు. బయటకు వచ్చి చెప్పుకొన్నా న్యాయం జరగదేమో అనే భయం ఉండేది. దానికి తోడు అవకాశాలు రానివ్వకుండా అడ్డుకొంటారని ధైర్యం చేసేవాళ్లు కాదు. అయితే ఇప్పుడు తమ సమస్యలు చెప్పుకొనేందుకు, వినేందుకు ఓ ఆసరా ఉందన్న ధైర్యం వచ్చింది. సోషల్ మీడియా పెరిగింది. మీడియా సపోర్ట్ కచ్చితంగా బాధితులకు ఉంటుందన్న భరోసా దక్కింది. మరీ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా లైంగిక వేధింపులపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. బాధితులు తమ సమస్యల్ని, తమపై జరుగుతున్న అన్యాయాల్ని చెప్పుకోవడానికి ఇదే సరైన సమయం. ఇది వరకే ఛాంబర్ దృష్టికి కొన్ని కేసులు వెళ్లాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించారు కూడా. అయితే సర్దుబాటు కాని వ్యవహారాలు ఇంకా అలానే ఉండిపోయాయి. గుట్టు చప్పుడు కాకుండా పరిష్కారం చేద్దామనుకొన్న విషయాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. జానీ మాస్టర్ కేసు విషయంలో బాధితురాలికి సరైన న్యాయం జరిగితే… మరిన్ని విషయాలు వెలుగులోకి రావడం తథ్యం.