తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల గోల ఎప్పుడూ ఉండేదే.. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఒకప్పుడు ఇస్తే పీసీసీ ఇవ్వండి..అంతేకాని ప్రాధాన్యత లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అక్కర్లేదు అంటూ పెదవి విరిచిన నేతలే.. ఈ పదవి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. కారణం..ఒక్కసారి ఈ పదవి చేపడితే తమ జాతకం మారిపోతుందని విశ్వసించడమే.
కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రాష్ట్ర విభజన తర్వాత నేతలను సంతృప్తి పరిచేందుకు హైకమాండ్ కొత్తగా సృష్టించింది. మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి ఆ తర్వాత పీసీసీ అయి ఢిల్లీ పెద్దలకు చేరువ అయ్యారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు.
ఉత్తమ్ అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క జాతకం కూడా మారిపోయింది. సీఎల్పీ నేతగా పని చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆతర్వాతే పీసీసీ చీఫ్ గా నియామకం అయి హైకమాండ్ కు మరింత చేరువై సీఎం పీఠాన్ని అధిరోహించారు.
ఇక,ప్రస్తుత పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగారు. ఇలా కార్యనిర్వహక అధ్యక్షులుగా పని చేసిన నేతల జాతకం మారుతుండటంతో…ఈ పోస్ట్ కోసం కాంగ్రెస్ లో సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ ను ప్రకటించనుండటంతో.. సీనియర్లు ఈ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.