బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు జోలపాట పాడిన ఆ పార్టీ అనుకూల పత్రిక..ఇప్పుడు రేవంత్ సర్కార్ పై కట్టు కథల కల్పనలో బిజీ బిజీగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం తలంటిందని స్వయం సంతృప్తి కథనాలను ప్రచారం చేస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అసలెందుకు అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది..? ఇందుకు నమస్తే పేలవమైన కథనం రాసుకొచ్చింది.
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెబుతోంది. భవిష్యత్ లో ఇదే జరిగితే దానికి బాధ్యులు ఎవరూ అంటూ అధిష్టానం సీఎం రేవంత్ ను నిలదీసిందని, అందరి ఆమోదంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సింది కదా అంటూ హైకమాండ్ సీరియస్ అయిందని రాసుకొచ్చింది. అసలే విగ్రహ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఈ విషయంలో అధికార పార్టీ నిర్ణయాన్ని బలపరుస్తుందా? ఈ విషయంలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం అవుతుంది..ఈ విషయం అధిష్టానంకు తెలియదా? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి.
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేసి అధిష్టానం వద్ద రేవంత్ మరిన్ని మార్కులు కొట్టేశారని వాదనలు వినిపిస్తుంటే…నమస్తే మాత్రం అందుకు విరుద్ధమైన కథనం ప్రచురించింది. నమస్తే ప్రచురించిన కథనంలో ఏమాత్రం మెరిట్స్ లేవని…అదంతా కల్పిత కథనమని, రేవంత్ పై విషం కక్కడమే నమస్తే డ్యూటీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.