కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదు తీసుకొన్న పోలీసులు, ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ పూర్తిగా రికార్డ్ చేయడమే కాకుండా, ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ కూడా ఓ కమిటీ నియమించి, నిజానిజాలను నిర్దారించే పనిలో సీరియస్ గా నిమగ్నమైంది. అయితే ఇంత జరుగుతున్నా, ఇప్పటి వరకూ జానీ మాస్టర్ తెరపైకి రాలేదు. జానీ మాస్టర్ పరారిలో ఉన్నారని, ఆయన ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని పోలీసులు తెలిపారు. మరోవైపు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. జానీ మాస్టర్ ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. నెల్లూరు పోలీసులు కూడా జానీ మాస్టర్ కోసం జల్లెడ పడుతున్నారు.
జానీ మాస్టర్ ప్రస్తుతం న్యాయపరమైన సలహాలు తీసుకొంటున్నారని, ముందస్తు బెయిల్ పొందాక, పోలీసుల ముందు లొంగిపోతారని తెలుస్తోంది. ఇలాంటి కేసుల్లో చిక్కుకొన్నవాళ్లంతా చేసే పని అదే. ఛాంబర్ పెద్దలు కూడా జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడన్న విషయంలో కూపీ లాగినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ ఓ లాయర్ సంరక్షణలో ఉన్నారని, ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో న్యాయ వాది సలహాలు, సూచనలు తీసుకొంటున్నారని, తనకు అనుకూలంగా కొన్ని సాక్ష్యాలు సేకరించుకొనే పనిలో ఉన్నారని, ఆ తరవాతే పోలీసులకు లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికల్లా జానీ మాస్టర్ లొంగిపోవడమో, లేదంటే జానీని పోలీసులు పట్టుకోవడమో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.