ఒకే దేశం-ఒకే ఎన్నికలు. గత ఎన్నికలకు ముందే ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నివేదిక ఇవ్వటం జరిగిపోయాయి.
తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఉభయ సభల ముందుకు తీసుకరాబోతుంది.
ప్రస్తుత ఎన్డీయే సర్కార్ హయంలోనే జమిలీ ఎన్నికలను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని కూడా ఎర్రకోట నుండి తన సందేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక… దీని వల్ల అభివృద్దికి ఆటంకం కలుగుతోంది. ఎన్నికల నిర్వహణ వ్యయాలతో పాటు కొత్త పనులు చేపట్టలేకపోతున్నాం. అందుకే ఒకే దేశం-ఒకే ఎన్నికకు ఎన్డీయే కట్టుబడి ఉందని బీజేపీ స్పష్టం చేస్తోంది.
అయితే, ఇప్పటికే కోవిడ్ కారణంగా వాయిదా పడిన జన గణనను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయబోతుంది. ఇది పూర్తి చేయగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. ఆ తర్వాత జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని… అదే జరిగితే 2027లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.