ఎవరైనా సీఎం అధికారంలో ఉంటే తమ కుటుంబ సంస్థలకు ఒక్క రూపాయి మేలు చేయాలన్నా కిందా మీదా పడతారు. ప్రజలు ఏమనుకుంటారో అని సిగ్గుపడతారు. కానీ జగన్ రెడ్డి అలా కాదు. నేరుగా ఖజానా నుంచి సొంత కంపెనీకి నిధులు బదిలీ చేసుకుంటారు. ఒక్క సాక్షి పత్రికకే… ప్రకటనలు, చందాల రూపంలో ప్రజా సొమ్ము నేరుగా ఖజానా నుంచి రూ. 650 కోట్లు వెళ్లాయంటే చిన్న విషయం కాదు. ఇది న్యాయబద్దంగా వెళ్లాయా అంటే.. అసలు చాన్స్ లేదని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
ఐదేళ్లలో సాక్షికి నేరుగా ఖజానా నుంచి వెళ్లిన సొమ్ము రూ. 450 కోట్లు. ఇది ప్రకటనల పేరుతో మళ్లించారు. ఒక్క పత్రికకే ఇంత ఇస్తే.. మరి మిగతా పత్రికలు, మీడియా అంతటికి ఎంత ఇచ్చి ఉంటారోనని అనుకుంటారు ?. కానీ అంత కంటే తక్కువే ఇచ్చారు. మరి సాక్షి అంత భారీగా సర్క్యులేషన్ సాధించిందా ? అంటే.. ఏబీసీ రికార్డుల ప్రకారం.. ఎక్కడో ఉంది సాక్షి. చివరికి సర్క్యూలేషన్ చూపించుకవడానికి వాలంటీర్లకు డబ్బులిచ్చి కొనుగోలు చేయించారు. ఇలా రెండేళ్లలో రెండు వందల కోట్ల రూపాయలు కాజేశారు.
ఈ అక్రమాలు అన్నీ.. కేబినెట్ ముందుకు వచ్చాయి. ఇందులో అన్ని రకాల ఉల్లంఘనలు జరిగాయని.. ముఖ్యమంత్రి స్థాయిలోనే కుట్ర చేసి ప్రజాధనం దోచుకున్నారని తేలుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై సమగ్ర విచారణ అంతర్గతంగా జరుగుతోంది. ప్రకటనలు ఇచ్చే రూల్స్ ఉల్లంఘించి మరీ వారికి ప్రకటనలు ఇవ్వడానికి.. వాలంటీర్లతో సాక్షి పత్రిక కొనిపించడానికి చేసిన అక్రమాలపై నివేదిక సిద్దమవుతోంది. ఈ జీవోను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశించింది. వైఎస్ జగన్ కన్నా భారతి రెడ్డినే ఈ కేసులో ఎక్కువ చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.