కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు కవిత భుజానికెత్తుకున్న ఉద్యమాన్ని ఇక కేటీఆర్ నడపబోతున్నారా…? కవితను రాజకీయంగా సైలెంట్ చేసే అవకాశం ఉందా…?
బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై పోరాడేందుకు ఎలాంటి అస్త్రం లేకుండా పోయింది. పార్టీ నేతలంతా ప్రభుత్వంపై విమర్శల వరకే ఆగిపోతే… ఎమ్మెల్సీ కవిత మాత్రం పార్టీ తరఫున కాకుండా, జాగృతి సంస్థ తరఫున బీసీ ఉద్యమాన్ని కవిత ఎత్తుకున్న సంగతి తెలిసిందే. దశల వారీగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతోన్న సమయంలోనే లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు అయ్యారు. అప్పటికే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించటం, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని లెవనెత్తుతూ వచ్చారు. కవిత అరెస్ట్ తర్వాత ఆ ఉద్యమం చేస్తున్న వారికి ఆర్థికంగా, రాజకీయంగా బీఆర్ఎస్ తరఫున ఎలాంటి మద్దతు లేకుండా పోయింది.
కానీ, తాజాగా కొందరు బీసీ నేతలు కేటీఆర్ ను కలవటం… ఆయన వెంటనే బీసీల కోసం పోరాటానికి సిద్ధమని ప్రకటించటం చకచకా జరిగిపోయాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు దిశగా కార్యాచచరణ ప్రకటించారు.
నవంబర్ 10లోపు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , లేదంటే తర్వాత సర్కార్ పై పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతామని కేటీఆర్ హెచ్చరించారు. అంటే…కవిత ఉద్యమాన్ని ఇక బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తుందని కేటీఆర్ పరోక్షంగా చెప్పేశారు. అయితే ఇక్కడ పలువురికి అనుమానాలు తలెత్తుతున్నాయి. కవిత ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఎత్తుకోబోతుంది అంటే కొద్ది కాలం వరకు ఆమె రాజకీయాలకు దూరం ఉండనున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి.