బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ విస్ర్కృతమైందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమా బాలీవుడ్లో ఏకంగా రూ.100 కోట్లు సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కథలో కంటెంట్ ఉంటే.. బాలీవుడ్‌లోనూ ఓ దక్షిణాది సినిమా పాగా వేయొచ్చన్న నమ్మకం కలిగించింది. దాంతో… మరిన్ని తెలుగు చిత్రాలు బాలీవుడ్లో అడుగుపెట్టడానికి తహతహలాడుతున్నాయి. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు పవన్‌కల్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదల చేస్తున్నారు. ఈ విషయం అభిమానుల్ని సంతోష పెట్టేదే. అయితే… సర్దార్కి ఇదంతా అవసరమా? అనే వాదనా వినిపిస్తోంది.
బాహుబలి ఓ విజువల్ వండర్. ఇండియన్ అవతార్‌గా సినీ విశ్లేషకులు ఆ సినిమాని భుజాలనెత్తుకొన్నారు. బాహుబలి విడుదలకు ముందు నుంచీ.. బాలీవుడ్‌లోనూ ఓ రకమైన హైప్ ఉంది ఆ సినిమాకి. దానికి తోడు రానా ఫేస్… హిందీ వెర్షన్‌కి బాగా పనికొచ్చింది. విజువల్‌గా గ్రాండ్‌గా ఉండడంతో బాహుబలికి కాసుల వర్షం కురిసింది. బాహుబలితో పోలిక తీయలేం గానీ… సర్దార్ ఫక్తు కమర్షియల్ సినిమా. ఇలాంటి సినిమాలు బాలీవుడ్లో బోల్డన్ని చూశారు. పైగా హిందీ జనాలకు పవన్ కల్యాణ్ గురించి ఏమాత్రం అవగాహన లేదు. కాజల్ కోసం సినిమా చూస్తారన్న నమ్మకం లేదు. ఆ మాత్రం దానికి హిందీలో ఈ సినిమా వెళ్లడం ఎందుకు? అన్నది సినీ విశ్లేషకుల వాదన. ఏదో మేమూ బాలీవుడ్ కి వెళ్తున్నాం అని చెప్పుకోవడానికి తప్ప… ప్రత్యేకమైన ఉపయోగమేమీ లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సర్దార్ సత్తా బాలీవుడ్లో ఎంత? అన్నది కాలమే చెప్పాలి.