సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు వస్తుంటాయి. నెట్ ఫ్లిక్స్ లో తాజాగా స్ట్రీమ్ అవుతున్న ‘అడియోస్ అమిగో’ కూడా లాంటి ప్రయోగాత్మక చిత్రమే. ఆసిఫ్ అలీ, సూరజ్ వెంజరమూడు లాంటి మంచి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రెండు పాత్రల చూట్టే నడిచిన ఈ సినిమాలోని కొత్తదనం ఏమిటి? ఈ ప్రయోగం ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
బోస్(సూరజ్ వెంజరమూడు) పెయిటింగ్ పనులు చేసుకునే రోజువారి కూలీ. తన సంపాదన అవసరాలకి సరిపోదు. తరచూ ఫ్రెండ్స్ దగ్గర చేబదులుగా అప్పులు చేస్తుంటాడు. ఓ రోజు బోస్ తల్లికి జబ్బు చేస్తుంది. చికిత్స కోసం పాతిక వేలు కావాలని ఊరు నుంచి బోస్ కి చెల్లాయి ఫోన్ చేస్తుంది. తనకి తరచూ అప్పు ఇచ్చే సుజన్ అనే స్నేహితుడికి ఫోన్ చేస్తాడు బోస్. ఉదయాన్నే బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే డబ్బు పట్టుకోస్తానని ఫోన్ లో చెప్తాడు సుజన్. సుజన్ కోసం బస్ స్టాప్ దగ్గర ఎదురుచూస్తుంటాడు బోస్. ఇంతలో సుజన్ నుంచి ఫోన్ వస్తుంది. డబ్బు తీసుకురావడానికి ఆలస్యమౌతుందని చెప్తాడు సుజన్. బస్ స్టాప్ లోనే బోస్ ఎదురుచూపులు కొనసాగుతుంటాయి.
ప్రిన్స్(ఆసిఫ్ అలీ) చాలా ధనవంతుడు. డబ్బుని లెక్క చేయడు. ఎప్పుడూ మందులోనే ఉంటాడు. తనకి పరిచయం లేని వ్యక్తులకి కూడా డబ్బుని చిత్తు కాగితాల్లా పంచేస్తుంటాడు. తన కంటికి కనిపించిన అందరినీ పిలిచి మాట్లాడేస్తుంటాడు. అలాంటి ప్రిన్స్ కి బాస్ స్టాప్ లో ఎదురుపడతాడు బోస్. బోస్ ని చూడగానే ప్రిన్స్ లో ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. తనతో మాట కలిపేసి మందు కొడదామని ఆఫర్ చేస్తాడు ప్రిన్స్. తనో ముఖ్యమైన పనిపై వచ్చానని బోస్ ఎంత చెప్పినా వినడు. ఇద్దరూ బస్ స్టాప్ లోనే మందుకొడతారు. ఆ సమయంలోనే ప్రిన్స్ బ్యాగ్ లో డబ్బు కట్టలు చూస్తాడు బోస్. దగ్గరలోనే సన్ సెట్ చాలా బావుంటుందని, అక్కడికి వెళ్దామని బోస్ ని అడుగుతాడు ప్రిన్స్. ముందు తనకి కుదరదని చెప్పిన బోస్, తర్వాత ప్రిన్స్ వాలకం చూసి అందోళనతో బస్ ఎక్కేస్తాడు. తర్వాత ఈ ఇద్దరి ప్రయాణం ఎలా జరిగింది? అసలు ప్రిన్స్ ఎందుకిలా రోడ్లుపట్టి తిరుగుతున్నాడు? డబ్బుని అలా ఎందుకు పారేస్తున్నాడు? అంత కోటీశ్వరుడు బోస్ కష్టాలు తెలుసుకున్నాడా? తనకి సాయం చేశాడా? ఈ జర్నీలో ప్రిన్స్ గురించి బోస్ తెలుసుకున్న వాస్తవాలు ఏమిటి ? అనేది మిగతా జర్నీ.
ఈ సినిమాలో వున్నది కథ అనడం కంటే ఒక ప్రయాణం అనడం సబబు. ఈ ప్రయాణం కూడా ప్రయోగాత్మకమైనదే. రెండు భిన్నమైన మనస్తత్వాలున్న అపరిచితులు కలుసుకోవడం, ఆ ప్రయాణంలో జీవిత సత్యాన్ని ఆవిష్కారంచే తరహా సినిమాలు ఇదివరకు కొన్ని వచ్చాయి. కమల్ హసన్, మాధవన్ నటించిన ‘సత్యమే శివం’ అలాంటి సినిమానే. థియేటర్స్ లో ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ తర్వాత కల్ట్ ట్యాగ్ వచ్చింది. ఆ సినిమా స్ఫూర్తి’అడియోస్ అమిగో’లో చాలా చోట్ల కనిపిస్తుంది. రెండు భిన్న మనస్తత్వాలు(వర్గాలు), డబ్బు, యాక్సిడెంట్, ఆరోపకారం, కమ్యునిజంలోని శ్రమ సిద్ధాంతం.. ఇలా అంతర్ణీనంగా కొన్ని పోలికలు కనిపిస్తాయి. అయితే ట్రీట్మెంట్ లో సత్యమే శివం సీరియస్ లైఫ్ డ్రామా. అడియోస్ అమిగో మాత్రం లైటర్ వెయిన్ కామెడీ ఎంటర్ టైనర్.
రెగ్యులర్ సినిమా కాదిది. ఏ పాత్రకి కూడా ఇంట్రడక్షన్ వుండదు. బోస్, ప్రిన్స్ క్యారెక్టర్స్ కి తప్పితే మిగతా ఏ క్యారెక్టర్ కూడా ప్రయాణంలో నిలబడదు. ఈ బీట్ ని అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ రెండు పాత్రలకి కనెక్ట్ అయితే.. సినిమా ఆద్యంతం చూసేవచ్చు. కనెక్ట్ కాకపోతే మాత్రం అదంతా టైం వేస్ట్ వ్యవరహంలా మారిపోతుంది.
బోస్ కి పాతిక వేలు కావాలి. ఆ మాట ప్రిన్స్ కి చెబితే.. అక్కడి సమస్య తీరిపోతుంది. ఇంక ప్రయాణం కూడా వుండదు. కరెక్ట్ గా ఇక్కడే రైటర్ తన ప్రతిభ చూపిస్తాడు. మ్యాజిక్ అంతా ఈ రెండు క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకోవడంలోనే వుంది.
బోస్ ఆత్మమాభిమానం కలిగిన మనిషి. ఎంత అవసరం ఉన్నపటికీ ఓ అపరిచితుడికి డబ్బు ఎలా అడిగేది? అనే మీమాంసలో ఉంటాడు. కానీ అతడిలో ఓ చిన్న ఆశ. అంత డబ్బున్న మనిషి తన గురించి పట్టించుకోడా? అని ఎక్కడో చిన్న నమ్మకం. ప్రిన్స్ ది ఇంకా గమ్మత్తయిన క్యారెక్టర్. ఎదుటివాడు ఏం ఫీలౌతున్నాడో అని కనీస స్పృహ వుండదు. ఈ కాన్ఫ్లిక్ట్ నే ఇంటర్వెల్ వరకూ చాలా ఆసక్తికరంగా నడిపారు. చాలా సార్లు బోస్, ప్రిన్స్ కి డబ్బు అడిగితే బావుండనే ఫీలింగ్ చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. ప్రిన్స్, హేమ(అనఘ) క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఓ ఎపిసోడ్ చూసిన తర్వాత జీవితం పట్ల ప్రిన్స్ ఎందుకింత ఉదారంగా ఉన్నాడో అర్ధమౌతుంది.
అంత ధనికుడిలా కనిపించిన ప్రిన్స్ వెనుక ఎలాంటి పరిస్థితులు వున్నాయో చూపించిన విధానం ఆసక్తికరంగా వుంటుంది. బిలినియర్ అయిన ప్రిన్స్.. ఓ పాతిక వేల కోసం పడిన పాట్లు డబ్బు కాన్సెప్ట్ ని మరో కోణంలో చూపిస్తుంది. ప్రిన్స్ లాంటి వ్యక్తులు చాలామందికి జీవితంలో ఎదురుపడే వుంటారు. ప్రిన్స్ సాయం చేస్తాడని ఆశించి వచ్చిన బోస్.. చివరికి ప్రిన్స్ కి సాయం చేయడం భలే అర్గానిక్ గా కుదిరింది. అయితే ఈ పోర్షన్ ని ఇంకాస్త పదునుగా చెప్పే అవకాశం వుంది. కానీ దర్శకుడు చాలా సాగదీత ధోరణిలో వెళ్ళాడు.
ఆసిఫ్ అలీ, సూరజ్.. ఈ ఇద్దరూ తమ నటనతో కట్టిపడేశారు. కథనంలో పెద్ద మెరుపులు లేనప్పటికీ తమ ప్రజెన్స్ తో ఆద్యంతం అలరించేశారు. మంచి నటులు వుంటే మామూలు స్క్రిప్ట్ లు కూడా గొప్పగా కనిపిస్తాయని చెప్పడనికి ఉదారణగా నిలిచారు. హేమ క్యారెక్టర్ లో కనిపించిన అనఘ చిన్న క్యారెక్టరే అయినా డీసెంట్ గా చేసింది. టామ్ చాకో గెస్ట్ లో మెప్పిస్తాడు
జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం ఎంగేజింగ్ గా వుంది. నహాస్ నాజర్ డైరెక్టర్ గా తన తొలి సినిమాతోనే సంథింగ్ స్పెషల్ అనిపించాడు. ఇదొక కొత్తరం ఫిల్మ్ మేకింగే. ఒక్క ఫ్లాష్ బ్యాక్ ని చూపించలేదు. బోస్, ప్రిన్స్ ఈ రెండు పాత్రల నుంచి కెమరా మరో చోటకి వెళ్ళదు. డైలాగులు నాన్ స్టాప్ గా వస్తూనే వుంటాయి. రెగ్యులర్ సినిమాలా కాకుండా ఏదైనా కొత్త తరహా సినిమా చూడాలనే ఆసక్తి వుంటే ‘అడియోస్ అమిగో’ ని ట్రై చేయొచ్చు.