తిరుపతి లడ్డూ. తిరుమలలో శ్రీవారి వెంకన్న దర్శనాన్ని ఎంత మహాభాగ్యంగా భావిస్తారో… తిరుపతి లడ్డూను అంతే మహాభాగ్యంగా భావిస్తారు. ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా ఉండదు… ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న భేదం ఉండదు… ప్రాంతం సమస్య అసలే ఉత్పన్నం కాదు. అంతా ఆ ఏడు కొండల వాడిని కొలిచేవారే. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు.
ఒకప్పుడు తిరుపతిలో ఉచిత భోజనం ఉండేది కాదు. అప్పుడు ఈ లడ్డూ ప్రసాదమే ఆకలి తీర్చేది అని చెబుతుంటారు. ఈ లడ్డుకు ఉండే రుచి, వాసన ఇతర ఏ లడ్డూకు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వాసనను బట్టి తిరుమల ప్రసాదం అని చెప్పేస్తుంటారు.
లడ్డూ కన్నా ముందు వడలు అక్కడ ఎక్కువ ఫేమస్. అయితే, 19వ శతాబ్ధంలో తీపి బుందీ తయారు చేయటం మొదలుపెట్టారు. అలా క్రమేపీ అది లడ్డూగా మారిపోయింది.
తిరుమలలో లడ్డూ తయారీకి ప్రత్యేకత ఉంటుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పటిక బెల్లం, శనగపిండి, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష, స్వచ్ఛమైన కర్పూరం వాడుతారు. అందుకే ఆ లడ్డూ రుచి, వాసన స్పెషల్ గా ఉంటుంది. ఈ లడ్డూల తయారీ కోసం ప్రత్యేక వంటశాల ఉంటుంది. దాన్నే పోటు అంటారు.
అయితే, కొంతకాలంగా ఈ లడ్డూ నాణ్యత కోల్పోతుందన్న విమర్శలున్నాయి. ఆనాటి లడ్డూల ఉండటం లేదు అంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే, నెయ్యిలో నాణ్యత తగ్గటం వల్లే లడ్డూ వాసన, రుచి కోల్పోతుందని తిరుమల వాసుల మాట. టీటీడీ తెచ్చే ముడిసరుకుల నాణ్యతను పరిశీలనకు పంపుతుంటారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక నెయ్యిని శాంపిల్స్ తీసుకొని రెండు వేర్వేరు ల్యాబులకు పంపగా… అందులో జంతు కొవ్వు అవశేషాలు రావటం భక్తులను విస్మయపరుస్తున్నాయి. భక్తుల మనోభావాలతో ఆడుకోవటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుండగా, తమ ప్రభుత్వం నాణ్యతను కాపాడేందుకు గతంలో నెయ్యి సరఫరా చేసే కర్నాటక ప్రభుత్వ రంగ డెయిరీ నందిని డెయిరీ నుండి తిరిగి కొనుగోలు ప్రారంభించామని ప్రభుత్వం చెప్తోంది.