ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం విచారకరమని పేర్కొన్న పవన్ కళ్యాణ్..అందుకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ట్విట్టర్ లో ఓ హిందూ సంస్థ ట్వీట్ కు పవన్ కళ్యాణ్ బదులిచ్చారు. వైసీపీ హయాంలో పని చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం బాకీ పడి ఉందని..వాటిని త్వరలోనే నిగ్గు తేల్చుతామని స్పష్టం చేశారు. శ్రీవారి ప్రసాదం కలుషితం చేయడం విచారకరమని, ఇది హిందువుల మనోభావాలను గాయపరిచిందని పవన్ పేర్కొన్నారు.
బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని..ఎంతటి వారున్నా సాధ్యమైనంత తొందరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.
ఇక, హిందూ ఆలయాలకు సంబంధించి సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సనాతన ధర్మం అపవిత్రం కాకుండా ఉండేలా మత పెద్దలు , విధాన నిర్ణేతలు ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలున్నట్లు రెండు ల్యాబులు రిపోర్ట్ ఇచ్చాయి. దీనిపై సీఎం చంద్రబాబు మండిపడగా, మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ ఆరోపణలు అంటూ కామెంట్ చేశారు. కానీ, సాయంత్రానికి టీడీపీ ఆధారాలను కూడా బయటపెట్టడంతో వైసీపీ సైలెంట్ అయ్యింది.