ఏఎన్నార్ జాతీయ అవార్డు ఈ యేడాది మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు. ఈనెల 28న హైదరాబాద్ లో అవార్డు ప్రదానోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హాజరు కానున్నారు. అక్కినేని శత జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఈ అవార్డుని చిరంజీవికి ఇస్తున్నట్టు మీడియా ముఖంగా తెలిపారు. సినీ రంగంలో విశిష్ట సేవలు అందించే నటీనటులకు అక్కినేని అవార్డు ఇవ్వడం చాలా ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. అయితే అక్కినేని మరణానంతరం ఈ అవార్డు కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. ఇక మీదట ప్రతీ యేటా, లేదంటే రెండేళ్లకు ఓసారి అవార్డు ప్రదానం చేస్తామని నాగార్జున ప్రకటించారు. అక్కినేని శత జయంతి సంవత్సరంలో ఈ అవార్డు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. అక్కినేని కుటుంబానికీ మెగా కుటుంబానికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి, అక్కినేని కలిసి `మెకానిక్ అల్లుడు` చిత్రంలో నటించారు. నాగార్జున, చిరు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఈ అనుబంధం ఈ అవార్డుతో మరింత బలపడనుంది.