అదానీ గ్రూప్ ఎలాంటి ప నులు చేసిన ఇండియాలో విచారణల్లో పెద్దగా ఏమీ తేలదు కానీ.. స్విట్జర్లాండ్ లో మాత్రం అలా కాదు. ఇప్పుడు ఆ గ్రూప్ కు చెందిన మనీలాండరింగ్ సొమ్ముపై స్విస్ రెగ్యూలేటరీ విచారణ సంస్థలు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నాయి. స్విస్ అటార్నీ జనరల్ కార్యాలయం స్విస్ బ్యాంక్ అకౌంట్లలో అదానీకి ఉన్న దాదాపు రూ.2600 కోట్లు సొమ్మును సీజ్ చేసిందని హిండెన్ బెర్గ్ ఇటీవల ప్రకటించింది.
స్విస్ ఫెడరల్ క్రిమినల్‌కోర్డు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను గత ఏడాది జూలైలోనే ప్రారంభించింది. మనీలాండరింగ్‌కు పాల్పడిన వ్యక్తిని, సంస్థ గుట్టును బయట పెట్టడానికి విచారణ సంస్థలు దర్యాప్తు వేగవంతం చేశాయి. మారిషస్, బెర్ముడాల్లో అదానీ స్టాక్స్‌కు చెందిన నిధులను పెట్టుబడిగా పెట్టి మనీలాండరింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. స్విస్ మీడియాలో ఇది అదానీ గ్రూప్ దేనని వార్తలు వచ్చాయి. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదానీ అనుబంధ సంస్థ ఫ్రంట్‌మాన్ పెట్టుబడి పెట్టిందని ప్రకటించారు.
2021 నాటికే అదానీపై మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ విచారణలో భాగంగా స్విస్ అధికారులు బహుళ స్విస్‌బ్యాంక్ ఖాతాలలో ఈ సొమ్మును స్తంభింపజేసినట్లు హిండెన్ బెర్గ్ ప్రకటించింది. ఈ వ్యవహారంలో స్విస్ దర్యాప్తు సంస్థలు అదానీ గురించి వ్యతిరేక సాక్ష్యాలు ప్రవేశపెడితే.. మరోసారి ఆదానీ స్టాక్స్ ఘోరంగా పడిపోయే అవకాశం ఉంది.