Q&A… ఈమధ్య సినిమా ప్రమోషన్ అంటే గుర్తొచ్చేది ఇదే. చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం. ఒక్కో ఈవెంట్ కి పదుల కొద్దీ యూ ట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీమర్సూ హాజరవ్వడం, వాళ్లు రకరకాల ప్రశ్నలు అడగడం, వాటికి సినిమావాళ్లు సమాధానాలు చెప్పడం, వాటిలో ఒకటో, రెండో వైరల్ అవ్వడం…. ఇదే కార్యక్రమం. చిన్న సినిమాలకు, మీడియం రేంజు సినిమాలకూ Q&A ల వల్ల ప్రచారం బాగానే జరుగుతోంది. అందుకే నిర్మాతలు కూడా వీటిపై దృష్టి పెడుతున్నారు. అయితే పెద్ద హీరోలు, దర్శకులు మాత్రం Q&Aలకు ససేమీరా అంటున్నారు.
దానికీ కారణం ఉంది. Q&Aలలో సినిమాలకు సంబంధించిన విషయాలు తక్కువ. మిగిలిన కాంట్రవర్సీలు ఎక్కువ నడుస్తున్నాయి. సినిమాలకు సంబంధం లేని ఏవేవో విషయాలు బయటకు లాగి, ఆ ప్రశ్నలతో సెలబ్రెటీలను విసిగిస్తున్నారు కొంతమంది. ఆ ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలు బాగానే వైరల్ అవుతున్నా, వాటివల్ల సెలబ్రెటీలకు లేనిపోని తలనొప్పి. కొన్ని Q&Aలలో జర్నలిస్టులకూ, సెలబ్రెటీలకూ మధ్య.. వాగ్వాదాలు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ సినిమా ప్రచారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అందుకే పెద్ద హీరోలు Q&Aలకు దూరంగా ఉంటున్నారు. ‘దేవర’ కోసం మీట్ ద ప్రెస్ ఏర్పాటు చేద్దామని నిర్మాతలు భావించారు. కానీ ఆ తరవాత ఆ ఆలోచన విరమించుకొన్నారు. కొంతమంది కేవలం అటెన్షన్ కోసం అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నారని, వాటికి సమాధానం చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ అని, అందుకే పెద్ద హీరోలు అసలేమాత్రం ఆసక్తి చూపించడం లేదని పీఆర్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఏదోలా ప్రేక్షకుల అటెన్షన్ సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వివాదాలు తమకు ప్లస్ అవుతుంటాయి. పెద్ద సినిమాలకు ఆ అవసరం లేదు. అందుకే Q&Aలను లైట్ తీసుకొంటున్నాయి.