ఏపీలో టీడీపీ గెలవడం, హైడ్రా ఎఫెక్ట్ కారణంగా హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని జరుగుతున్న ప్రచారానికి వాస్తవనికి హస్తిమశకాంతరం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. హైడ్రా దూకుడు చూపించిన ఆగస్టు నెలలో రూ. 4 వేల కోట్లకుపైగా విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఇది గత ఏడాది ఆగస్టులతో పోలిస్తే 17 శాతం ఎక్కువ. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలపైన నైట్ ప్రాంక్ సంస్థ వెల్లడించిన రిపోర్టుల్లో … హైదరాబాద్ రియాలిటీ ఉహించని విధంగా ఉందని అర్థమవుతుంది. మొత్తంగా ఆగస్టులో 6439 ఇళ్ల అమ్మకాలు జరిగి రిజిస్ట్రేషన్లు జరిగాయి. జనవరి నుంచి 54,483 ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి ఇది గత ఏడాది కన్నా పద్దెనిమిది శాతం ఎక్కువ.
హైదరాబాద్లో జనవరి నుంచి ఆగస్టు వరకూ 33,641 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల లావాదేవీలు జరిగాయి. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 41 శాతం ఎక్కువ. ఇది పెరిగిన ధరలను సూచిస్తోందని అనుకోవచ్చు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల మార్కెట్ ఊహించిన దాని కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. విశేషం ఏమిటంటే ఈ ఏరియాల్లో కొత్త ఇళ్లే కాదు.. రీసేల్కు వచ్చే ఇళ్లకూ మంచి డిమాండ్ ఉంటోంది.
నైట్ ఫ్రాంక్ రిపోర్టులో కీలకమైన విషయం మరొకటి ఉంది.. అదేమిటంటే.. ఇళ్ల మార్కెట్లో మధ్యతరగతి ప్రజల వాటానే ఎక్కువ. రూ. యాభై లక్షలలోపు ఉన్న ఇళ్లనే అత్యధిక మంది కొనుగోలు చేస్తున్నారు. మొత్తంఇళ్ల లావాదేవీల్లో 59 శాతం యాభై లక్షల లోపు విలువ చేసే ఇళ్లవే. అదే సమయంలో రూ. కోటి కంటే ఎక్కువ ధర ఉండే ఇళ్లు కొనుగోలు చేసేవాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇలాంటి ఇళ్లకు గత ఏడాది కన్నా ఈ ఏడాది 9 శాతం డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో యాభై లక్షలలోపు విలువ చేసే ఇళ్లకు డిమాండ్ తగ్గి కోటి వరకూ ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని ఈ ట్రెండ్ సూచిస్తోంది.