తప్పు ఎవరు చేసినా తప్పే. దేవుడికి ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. గత ప్రభుత్వం కక్కుర్తితో చేసిన వ్యవహారంతో దేవదేవుడికి అపచారం జరిగింది. అందుకే భక్తులంతా మథనపడుతున్నారు. తప్పు ఎవరిదన్న సంగతి పక్కన పెట్టి ముందు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఈ దిశగా మొదటి అడుగు వేశారు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో వస్తున్న వార్తలు కోట్లాది మంది హిందువుల మనో భావాల్ని దెబ్బతీశాయి. అందుకే పవన్ నంబూరు ఆలయంలో దీక్ష చేపట్టి పదకొండు రోజుల తర్వాత తిరుమలలో దర్శనం చేసుకోవాలని నిర్ణయించారు. దీక్ష ప్రారంభించారు.
హిందూత్వ వాదంలో పవన్ ఓ మెట్టు పైకి ఎదిగారని అనుకోవచ్చు. నిజానికి పవన్ కల్యాణ్ తన భావజాలం.. కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుందని చాలా సార్లు చెప్పారు. కానీ బీజేపీకి దగ్గరయ్యారు కానీ బీజేపీ రేంజ్ హిందూత్వ వాదాన్ని ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు కూడా ఆయన తనలోని భక్తుడికి కలిగిన ఆవేదన మేరకు కార్యక్రమాలు చేపడుతున్నారు. హిందువుల మనసులో భావనలు ఎలా ఉన్నాయో.. పవన్ భావనలు కూడా అలాగే ఉన్నాయని అనుకోవచ్చు.
రాజకీయాల్లో ఎవరు ఔనన్నా.. కాదన్నా.. కుల, మత రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏ పార్టీ అయినా ఆ వ్యూహంలో భాగంగానే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. దానికి పవన్ కల్యాణ్ అతీతడేమీ కాదు. ఆయన ఎవర్నీ నొప్పించకుండా హిందువుల్ని ఆకట్టుకునే రాజకీయాలు చేయడానికి సిద్దమయ్యారని అనుకోవచ్చు. అయితే పవన్ కల్యాణ్ తన స్పందన వెనుక ఎలాంటి రాజకీయం వ్యూహం ఉందని చేశారో కానీ.. రాజకీయంగా మాత్రం చర్చనీయాంశం అవుతోంది. కానీ రాజకీయం కోసమే ఇది చేయడం లేదని అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు.