కేటీఆర్ తెలిసి ఆరోపణలు చేస్తారో ..తెలియక చేస్తారో కానీ ఆయన ఎక్కువగా బీఆర్ఎస్తో సన్నిహితమైన వారిపైనే ఆరోపణలు చేస్తున్నారు. సూదిని సృజన్ రెడ్డి అనే వ్యక్తికి జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టులు ఇచ్చారని .. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డి బావమరిదని చెబుతున్నారు. అంటే ఆయన భార్య సోదరుడన్నట్లుగా చెప్పారు. సూదిని జైపాల్ రెడ్డి సోదరి కూతురు రేవంత్ రెడ్డి భార్య కాబట్టి… ఇంటి పేరు కూడాకలిసింది కాబట్టి అందరూ అదే అనుకుంటారని అనుకున్నారు.
నిజానికి ఈ సృజన్ రెడ్డి… రేవంత్ రెడ్డి భార్య తరపు బంధువే కానీ.. సొంత బావమరిది కాదు. కానీ కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడు. ఈయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ కు వెళ్లారు. అలా వెళ్లినందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రెండున్నర వేల కోట్ల ప్యాకేజీ పనులు దక్కాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు. అలాగే లిక్కర్ స్కామ్‌లోనూ ఈ సృజన్ రెడ్డి పేరు వినిపించింది. అప్పుడే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.. . .ఆ బంధువు ఈ బంధువు అని ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలన్నారు.కానీ ఆయనపై ఏ కేసులూ రాలేదు.
ఇప్పుడు జల్ జీవన్ కాంట్రాక్టులు ఫిబ్రవరిలోనే ఇచ్చారని కొత్త విషయంతో కేటీఆర్ తెరపైకి వచ్చారు. దీంతో అసలు సృజన్ రెడ్డి ఎవరన్నదానిపై లోతుగా వివరాలు బయటకు లాగుతున్నారు. ఆయనకు కాంగ్రెస్ లో కన్నా బీఆర్ఎస్ లోనే ఎక్కువ ప్రయోజనాలు కలిగినట్లుగా బయటపడటం… కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ మారిన తర్వాత కాంట్రాక్ట్ ఇవ్వడం .. బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగానే మారింది.