జాతీయ స్థాయిలో తనకు ఇండీ కూటమి మద్దతు ఉంటుందని ఢిల్లీలో చేసిన ధర్నా ద్వారా జగన్ సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. కానీ లడ్డూ వివాదం తరవాత ఆయన లాంటి రాజకీయ నాయకుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అందరూ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి రాహుల్ గాంధీ కూడా లడ్డూ వివాదంలో వ్యతిరేకంగా స్పందించారు. దీంతో వైసీపీకి ఏమైనా ఆశలు ఉంటే ఆవిరయ్యాయి.
లడ్డూ వివాదం తర్వాత నార్త్ లో చాలా వరకూ రియాక్షన్ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో భక్తులు రోడ్డెక్కరు. కానీ ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తారు. కానీ ఉత్తరాదిన హిందూవాదులు మాత్రం అగ్రెసివ్ గా స్పందించారు. ఇది ఓ మత ఔన్నత్యానికి సంబంధించిన విషయం కావడంతో… తప్పును తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే బీజేపీ నేతలంతా స్పందించారు. చాలా చోట్ల జగన్ దిష్టిబొమ్మల్ని కాల్చడం వంటి పనులు చేశారు. హిందువుల్లో ఓ రకమైన అసంతృప్తి ఉత్తరాదిన ఉంది. లడ్డూ కల్తీకి జగనే కారణమన్న అభిప్రాయం బలపడింది. ఇలాంటి సమయంలో జగన్ కు ఏ కోణంలో మద్దతు పలికినా అది తమకు నష్టమేనని ఇండీ కూటమి పార్టీలు ఖచ్చితంగా అనుకుంటాయి.
మెల్లగా కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు లడ్డూ వివాదంతో ఆగిపోతాయని అనుకోవచ్చు. ఇప్పుడల్లా ఏ విషయంలో అయినా జగన్ కు కాస్తంత మద్దతు ప్రకటించాలంటే ఆ పార్టీలన్నీ ముందూ వెనుకా ఆలోచించుకుంటాయి. ఇప్పటికే ఆయనపై అత్యంత అవినీతి పరుడన్న బిరుదు ఉంది. ఈ అవినీతి కోసం.. శ్రీవారి లడ్డూల్నీ కల్తీ చేశారని కీర్తి మూటగట్టుకున్న ఆయనతో పెట్టుకుంటే… మొదటికే మోసం వస్తుందని ఎక్కువ పార్టీలు భావిస్తాయి. అందుకే… ఇప్పుడల్లా జగన్ రెడ్డి అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి దగ్గర కాలేరు. ఎప్పటిలా ఒంటరిగా ఉండాల్సిందే.