ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశ పెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనేక విషయాల్లో విశేషాలను ఆవిష్కరించింది. మొత్తం రూ. 1,30,415.87 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయ ప్రతిపాదన రూ. 67,630.73 వేల కోట్లు. ప్రణాళికేతర వ్యయం 62,785.14 వేల కోట్లు. ప్రణాళికేతర వ్యయ ప్రతిపదాన అడ్డగోలుగా పెంచుతూ బడ్జెట్లను ప్రవేశ పెట్టడం చాలా రాష్ట్రాల్లో ఆనవాయితీ. కేంద్రంలోనూ అంతే. చివరకు ఏపీలోనూ ప్రణాళికా వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం చాలా ఎక్కువ. కానీ ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండటం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి సూచిక.
ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందించాలనే మహా సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథకు భారీ కేటాయింపులు చేశారు. దీనికి రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత నీటి పారుదలకు రూ. 25 వేల కోట్లు ప్రతిపాదించారు. ఎస్సీ సంక్షేమానికి రూ. 7122 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.3552 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.2538 కోట్లు కేటాయించారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీల సంక్షేమానికి అతి తక్కువ నిధులు కేటాయించడం ఈ బడ్జెట్లో అతిపెద్ద మైనస్ పాయింట్. ఆరోగ్య రంగానికి రూ. 5967 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.7400 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి రూ. 6,759 కో్ట్లు దక్కాయి.
విద్యాశాఖలో ప్రణాళికేతర వ్యయం కింద రూ. 9044 కో్ట్లు ప్రతిపాదించారు. ప్రణాళికా వ్యయంకింద రూ.1,164 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు దక్కాయి. ఈ రంగానికి రూ.10,731 కోట్లు కేటాయించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా భారీగా, రూ. 7,861 కోట్లు కేటాయించారు. మొత్తం మీద తమకు ప్రాధాన్యరంగాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. ఎస్సీ సంక్షేమంలో మాకు మేమే సాటి అని చెప్పుకోవడం అవసరం కాబట్టి నిధులు భారీగా దక్కాయి. అదే దామాషాలో బీసీలకు నిధులు దక్కలేదు. ఉన్న పథకాలకు అందుబాటులో వనరుల నుంచి నిధులు కేటాయించడం తప్ప, కొత్తగా పథకాలతో ప్రయోగాలు చేయడంపై ఆర్థిక మంత్రి దృష్టిపెట్టలేదు. మొదలుపెట్టిన పనులను పూర్తిచేయాలనే ఉద్దేశం ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాస్తవిక దృష్టితో బడ్జెట్ ను ప్రవేశపెట్టారని స్పష్టమవుతుంది.
ఇంటింటికీ మంచినీళ్లు సరఫరా చేయాలనేది చాలా పెద్ద సంకల్పం. సిద్దిపేట ప్రయోగాన్ని రాష్ట్రమంతా అమలు చేయడానికి కేసీఆర్ కంకంణం కట్టుకున్నారు. మిషన్ భగీరథ పేరుతో మహత్తర కార్యక్రమం చేపట్టారు. దానిక సముచితమైన నిధులను కేటాయంచడం ద్వారా పనులకు మార్గం సుగమం చేయడానికి తనవంతు సహకారాన్ని ఆర్థిక మంత్రి అందించారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో మేళవించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక తపన ఈ బడ్జెట్లో ఆవిష్కృతమైందనేది వాస్తవం.