అంగరంగ వైభవంగా జరగాల్సిన ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సిల్ అయ్యింది. అంచనాకు మించి తరలి వచ్చిన ఎన్టీఆర్ అభిమానుల్ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. చివరి వరకూ అభిమానుల్ని కంట్రోల్ చేసి, ఈవెంట్ నిర్వహిద్దాం అనుకొన్నా, అది సాధ్యం కాలేదు. అభిమానుల్ని బయటకు పంపించేసి, కేవలం చిత్రబృందంతోనే ఈవెంట్ నిర్వహిద్దామనుకొన్నా వీలు కాలేదు. చివరికి ఈవెంట్ ని రద్దు చేయాల్సివచ్చింది.
కేవలం 5 నుంచి 8 వేల కెపాసిటీ గల వేదిక నోవాటెల్. అంతకు మించి ఈ స్థలంలో క్రౌడ్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఈ ఈవెంట్ కు దాదాపు 20 వేలమంది అభిమానుల వచ్చేశారు. ఫ్యాన్ పాసులే దాదాపుగా 10 వేలు ప్రింట్ చేయించారని తెలుస్తోంది. సెలబ్రెటీ పాస్లు, వీఐపీ, వీవీఐపీ, మీడియా పాసులు మరో పది వేల వరకూ ఉంటాయి. సాధారణంగా వచ్చే క్రౌడ్ కి రెట్టింపు పాసులు ముద్రిస్తుంటారు. ‘దేవర’ విషయంలో మాత్రం నాలుగు రెట్లు ఎక్కువగా పాసులు పంపిణీ చేసింది శ్రేయాస్ మీడియా సంస్థ. అయితే ఎన్టీఆర్ మీద అభిమానమో, దేవరకు ఉన్న క్రేజ్ వల్లో తెలీదు కానీ, సభా స్థలానికి దాదాపుగా 20 వేలమంది అభిమానులు వచ్చేశారు. ముందుగా అభిమానుల్ని, వీవీఐపీలను, వీఐపీలను లోపలకు పంపించారు. వాళ్లతోనే సభాస్థలం మొత్తం నిండిపోయింది. సెలబ్రెటీ, మీడియా పాసులు దక్కించుకొన్నవాళ్లు బయటే నిలబడిపోయారు. లోపల జనం కిక్కిరిసిపోవడంతో వాళ్లంతా వేదికకు అతి దగ్గరగా వెళ్లిపోయారు. నటీనటులు, అతిథులకు కేటాయించిన గ్యాలరీ సైతం ఆక్రమించారు. వందలాది మంది అభిమానులు నేల మీదే తిష్ట వేశారు. ఎన్టీఆర్, జాన్వీకపూర్లాంటి స్టార్లు వస్తే.. అభిమానులు ఇంకెంత ముందుకు దూసుకువస్తారో అనే భయం పోలీసులకు పట్టుకొంది. కొంత క్రౌడ్ ని వెనక్కి పంపి, సెలబ్రెటీ గ్యాలరీని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఆ ప్రయత్నాలేం ఫలించలేదు.
ఇలాంటి ఈవెంట్స్ ని అవుడ్డోర్ లో నిర్వహించాల్సింది. అందుకు కావల్సినన్ని వేదికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా తరలివస్తారని తెలుసి కూడా నోవాటెల్ లాంటి వేదిక ని ఎంచుకోవడంలో నిర్వాహకుల వైఫల్యం కనిపిస్తోంది. ‘దేవర’ ఈవెంట్ కాన్సిల్ అవ్వడం.. అభిమానుల్నే కాదు చిత్రబృందాన్నీ తీవ్ర నిరాశలో పడేసింది. ఎన్టీఆర్ సోమవారం అమెరికా వెళ్లాల్సివుంది. అంటే.. ఈలోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం అసాధ్యం. కనీసం హైదరాబాద్ లో ఓ ఈవెంట్ పెట్టాలన్నా… ఎన్టీఆర్ అందుబాటులో ఉండకపోవొచ్చు.