లడ్డూ పాపంలో బీజేపీకి భాగం పంచేందుకు జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ బోర్డులో బీజేపీ నేతలు చెప్పిన వారికి పదవులు ఇవ్వడాన్ని అవకాశంగా చేసుకుని బీజేపీపైకి అస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. వైసీపీదే బాధ్యత కాదని.. బీజేపీకి ఉందని చెప్పేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో కానీ… వైసీపీ వ్యూహం మాత్రం.. ఏదో తేడాగా ఉందని సొంత పార్టీ నేతలు అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
టీటీడీ బోర్డు అంటే చాలా డిమాండ్ ఉందని.. పెద్ద పెద్ద వాళ్లు సభ్యత్వాల కోసం ఒత్తిడి చేస్తారని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి ఇలా తనకు వచ్చిన సిఫారసుల మేరకు తనకు ఎవరు ఉపయోగపడతారో.. వారు సిఫారసు చేసిన వారికి టీటీడీ బోర్డులో సభ్యత్వాలు ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా అదేదో బీజేపీ కోటా కింద ఇచ్చినట్లుగా ఆయన చెబుతున్నారు. సిఫారసు చేసిన వాళ్ల మీద భయంతోనే.. భక్తితోనే పదవులు ఇచ్చి ఉంటారు కానీ.. బీజేపీని చూసి కాదు.
అయినా టీటీడీ బోర్డు ఎప్పుడూ నామ మాత్రమే. ఆ టీటీడీ బోర్డు సభ్యత్వాలు పొందిన వారికి కూడా.. అక్కడి రోజు వారీ వ్యవహారాలతో పని లేదు. నిజానికి వారికి సభ్యత్వం ఓ హోదా… దర్శనాల్లో గౌరవం .. ఇతర అవసరాల కోసం తెచ్చుకున్న పదవి. అలాంటి వారిని అడ్డం పెట్టుకుని టీటీడీ బోర్డు పెద్దలు అడ్డగోలుగా వ్యవహరించి కల్తీ చేశారు. ఇప్పుడు బోర్డులో మీరు కూడా ఉన్నారు కదా అని ఆయన నిందలు వేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో జగన్ రెడ్డి .. బీజేపీని కూడా లాగాలనుకుంటున్నారు. దానికి కారణం ఏమిటో కానీ… ఇలా తమను టార్గెట్ చేయడంపై.. ఆ పార్టీ కేంద్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. జగన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారుతుంది.