The Mystery Of Moksha Island Web Series Review
దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అనీష్ కురువిల్లా. నిజానికి ఆయన డైరెక్టర్ కావాలనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన తీసిన అవకాయ్ బిర్యానీ, కో అంటే కోటీ సినిమాలు పెద్ద ప్రభావాన్ని చూపలేదు. దీంతో నటనపైనే ఫోకస్ పెట్టారు. అయితే ఓటీటీ వచ్చాక మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. గతంలో జీ5 కోసం గాడ్స్ అఫ్ ధర్మపురి వెబ్ సిరిస్ చేశారు. తాజాగా ఆయన దర్శకత్వంలో హాట్ స్టార్ లో ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ వెబ్ సిరిస్ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సిరిస్ కి కథ అందించడం మరో విశేషం. సైంటిఫిక్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరిస్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? అనీష్ కురువిల్లా దర్శకుడిగా తన మార్క్ చూపించారా? ప్రశాంత్ వర్మ రైటింగ్ లో ఎలాంటి మెరుపులు వున్నాయి?
విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) పెద్ద శాస్త్రవేత్త. తన ప్రయోగాల కోసం ఏకంగా ఒక ఐల్యాండే కొనుగోలు చేస్తాడు. తన ఆస్తి మొత్తం 24 వేల కోట్లు. అనుకోకుండా ఓ విమాన ప్రమాదంలో చనిపోతాడు విశ్వక్ సేన్. తన ఆస్తి ఎవరికి చెందాలనే దానిపై ఓ వీలునామా రాస్తాడు. ఆ వీలునామా ప్రకారం విశ్వక్ కుటుంబ సభ్యులందరికీ లెటర్స్ వెళ్తాయి. విక్కీ (నందు), ఝాన్సీ(ప్రియా ఆనంద్), భానుచందర్, మీనా(సుధ), మున్నా(అజయ్ కతుర్వార్) అదితి (సోనియా అగర్వాల్), ఇషా(తేజస్వి మదివాడ) తో పాటు మరికొందరు ఆ లెటర్స్ పట్టుకొని మోక్ష ఐల్యాండ్ లో అడుగుపెడతారు. ఆ ఐలాండ్ కి మేనేజర్ మాయ (అక్షర గౌడ). మాయ, విశ్వక్ రాసిన వీలునామాలోని కండీషన్ చెబుతుంది. ఆస్తి రావాలంటే అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వారం రోజులు ఆ ఐలాండ్ లో స్టే చేయాలి. అలా వారంరోజులు పాటు అక్కడ స్టే చేసిన వారు ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నారు? ఇంతకీ విశ్వక్ చేస్తున్న ప్రయోగాలు ఏమిటి? 15 ఏళ్ళుగా కుటుంబానికి దూరంగా వున్న విశ్వక్ ఇదంతా ఎందుకు చేశాడు? అనేది మిగిలిన కథ.
పేపర్ మీదున్న అక్షరాల్ని విజువల్ గా ట్రాన్స్ లేట్ చేయడం చాలా గొప్ప ఆర్ట్. కెమెరా, యాక్షన్, ఎమోషన్, యాంబియన్స్, మ్యూజిక్.. ఇలా ప్రతిది పెర్ఫెక్ట్ గా కుదరాలి. పేపర్ మీద వున్న సీన్ లోని డెప్త్ 50 శాతం విజువల్ గా చూపించగలిగినా పాసైపోయినట్లే. కాకపోతే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈ విషయంలోనే లెక్క తప్పుతుంటారు. ఈ సిరిస్ దర్శకుడు అనీష్ కురువిల్లా లో కూడా ఈ తడబాటు కనిపించింది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే మిస్టరీ థ్రిల్లర్స్ కి సరిపోయే పాయింటే ఇది. ఓ పదిమందిని ఒక్క చోటకి చేర్చి మిస్టీరియస్ గా ఒకొక్కరు చనిపోయే లాంటి డెత్ గేమ్స్ కాన్సెప్ట్. పైగా ఇందులో కొన్ని సైంటిఫిక్ ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. అయితే ఇవేవీ స్క్రీన్ మీదకి గ్రిప్పింగ్ గా రాలేదు.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ వున్న సిరిస్ ఇది (ఒకొక ఎపిసోడ్ నిడివి 30నిమిషాలకు పైనే). తొలి ఎపిసోడ్ ఇన్విటేషన్ తో కథ ఆసక్తిగా మొదలుపెట్టారు. విశ్వక్ సేన్, అతడి ప్రయోగాలు, మోక్ష ఐలాండ్, ఆస్తి వీలునామా.. ఇవన్నీ తర్వాత వచ్చే సన్నివేశాలపై ఆసక్తిని పెంచుతాయి. అయితే రెండో ఎపిసోడ్ నుంచి కథనం ట్రాక్ తప్పేస్తుంది. దీనికి కారణం… చూస్తున్న ఆడియన్ కి ఒక్క క్యారెక్టర్ తో కూడా ఎమోషనల్ కనెక్షన్ వుండదు. వందల మంది క్యారెక్టర్స్ ని పెట్టి తీసిన స్క్విడ్ గేమ్ లో కూడా సియోంగ్ గి-హున్ పాత్రతో పాటు ట్రావెల్ అవుతాడు ప్రేక్షకుడు. కానీ ఈ సిరిస్ లో అలాంటి ఒక ముఖ్యమైన, కథని నడిపించే పాత్ర కనిపించదు. ర్యాండమ్ గా ఎవరెవరో చనిపోతుంటారు, కొందరు అదృశ్యమైపోతుంటారు. ఏవేవో వింతగా జరుగుతుంటాయి. కానీ ఆడియన్ కి ఎలాంటి థ్రిల్ రాదు. కారణం.. ఆ పాత్రపై ఎలాంటి సింపతీ, ఎంపతీ వుండదు.
రెండు నుంచి ఆరో ఎపిసోడ్ వరకూ జరిగే సంఘటలు ఆసక్తిరేకెత్తించకపోగా సహనానికి పరీక్షలా వుంటాయి. చివరు రెండు ఎపిసోడ్స్ లో అసలు పాయింట్ ని రివిల్ చేస్తారు. ఈ ‘అమరత్వం’ పాయింట్ ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ సినిమాల్లో టచ్ చేసిందే. ఆ పాయింట్ కి కాస్త థ్రిల్, ట్విస్ట్ ని జోడించి చూపించారు. చివరి ఎపిసోడ్ లో వచ్చే ఓ ట్విస్ట్ బావుంది కానీ దాని చుట్టూ ఇచ్చుకునే వివరణ మరీ తికమకగా వుంటుంది. కాన్సెప్ట్, సస్పెన్స్ అంతా క్లైమాక్స్ లోనే రివిల్ చేయడం వలన వచ్చిన చిక్కది.
అశుతోష్ రాణా మెథడ్ యాక్టర్. ఆయనకి ఎలా పాత్ర ఇచ్చినా అందులో దూరిపోయే స్వభావం ఆయనది. ఆయన పోర్షన్ వరకూ డీసెంట్ గా చేశారు. తర్వాత ప్రియా ఆనంద్, నందు పాత్రలకు కొంచెం స్క్రీన్ స్పెస్ వుంది. అయితే పాత్రల నడకలో క్లారిటీ వుండదు. భాను చందర్ లాంటి నటుడిని సరిగ్గా వాడుకోలేదు. సోనియా అగర్వాల్ క్యారెక్టర్ కూడా తేలిపోయింది. రోషన్ కనకాల ఈ థ్రిల్లర్ లో నాన్ సింక్ అనిపించాడు. తేజస్వి మదివాడ కాస్త ‘అతి’గా కనిపిస్తుంది. అక్షర గౌడ ది లేడి విలన్ లాంటి పాత్ర. మిగతా పాత్రలకు పెద్ద ప్రాధాన్యత లేదు.
టెక్నికల్ గా ఈ సిరిస్ కి యావరేజ్ మార్కులు పడతాయి. చెప్పడానికి ఓ ఐలాండ్ వుంది కానీ దాన్ని టీవీ సీరియల్స్ లో చూపించినట్లు షూట్ చేశారు. థ్రిల్లర్ కి సరిపోయే యాంబియన్స్ లేదు. లైటింగ్ కూడా సరిగా లేదనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో. గ్రాఫిక్స్ నైపుణ్యం కూడా అంతత మాత్రమే. బీజీఎం ఎఫెక్టివ్ గా లేదు. కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా లోపాలు కనిపించాయి. చాలా సీన్స్ లాజిక్ కి దూరంగా వుంటాయి. మొత్తానికి ఈ సిరిస్ ఆడియన్స్ కి కావాల్సిన థ్రిల్ ఇవ్వలేకపోయింది.