పదేళ్లు పవర్ ను ఎంజాయ్ చేసి అధికారానికి అలవాటుపడిన బీఆర్ఎస్.. ప్రతిపక్షంలో కొనసాగుతూ తెగ ఇబ్బంది పడుతోంది. కాంగ్రెస్ లో ఒక్క రేవంత్ రెడ్డిని దెబ్బ తీస్తే మళ్లీ పవర్ లోకి వస్తామని గులాబీ దళం అప్పుడే లెక్కలు వేసుకుంటోంది. ఇందుకోసం రేవంత్ పై మూకుమ్మడిగా దాడి చేస్తోన్న బీఆర్ఎస్..తమ ఓటమికి దారి తీసిన ఫెయిల్యూర్ అస్త్రాన్ని రేవంత్ పైకి మళ్ళించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం నడుస్తుండటంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది బీఆర్ఎస్. తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి? విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కుతోంది అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ లోని బీసీ సామాజిక వర్గం నేతలను అధినాయకత్వం తమిళనాడు పంపుతోంది. అక్కడ అమలు అవుతోన్న బీసీ రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయాలని తమిళనాడు పర్యటన అనంతరం బీఆర్ఎస్ బలమైన పోరాటం చేసే దిశగా కార్యాచరణ రూపొందించికుంటోంది.
కానీ, బీఆర్ఎస్ చేపట్టబోయే బీసీ ఉద్యమానికి ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42నుంచి 23కు కుదించింది బీఆర్ఎస్సే…ఇప్పుడు అధికారం కోల్పోయాక రిజర్వేషన్ పెంపుపై ఫైట్ ను షురూ చేస్తే బీసీ ఉద్యమకారులు కారుతో కలిసి నడిచే అవకాశం లేదు. పైగా, బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు తరహాలో బీసీ బంధు తీసుకొచ్చినా..కేవలం బీసీ బంధును లక్షతోనే సరిపెట్టేశారు.. అదీ కొంతమందికే అందింది. దీంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.
అయినా…తాజాగా రేవంత్ ను దెబ్బ తీసేందుకు, తమను గద్దె దించిన అస్త్రాన్ని ఆయనపైకి మల్లించాలని అనుకుంటోంది బీఆర్ఎస్..మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.