ఏ రంగంలోనైనా శాశ్వతంగా నిలిచిపోవాలంటే ‘సిగ్నేచర్’ చాలా ముఖ్యం. ఎంతోమంది క్రికెట్ ఆడతారు. సెంచరీలు కొడతారు. మ్యాచులు గెలిపిస్తారు. కానీ కొంతమంది ఆటగాళ్లే అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకొంటారు నిలబడతారు. కారణం.. సిగ్నేచర్. అదే వాళ్ల సంతకం. అప్పటివరకూ ఎవరూ చూపని ఒక ప్రత్యేకమైన ముద్రని సృష్టించడం వారిని విలక్షణంగా నిలుపుతుంది. సచిన్ స్ట్రయిట్ డ్రైవ్, ద్రావిడ్ స్వేర్ కట్, ధోనీ హెలీ కాఫ్టర్ షాట్, విరాట్ కవర్ డ్రైవ్, రోహిత్ పుల్ షాట్.. వీళ్ళకి మాత్రమే సొంతమైన సిగ్నేచర్స్. సినిమా రంగంలోకి వద్దాం. ఇండియన్ సినిమా ఎంతోమంది సూపర్ స్టార్లని చూసింది. ఒకొక్క స్టార్ ది ఒక ప్రత్యేకత వుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అమితాబ్ బచ్చన్ యావత్ దేశాన్ని ఉర్రూతలూగించారు. తన స్టయిల్ తో మాగ్నైట్ లా ఆకర్షించారు రజనీకాంత్. చిరంజీవికి కూడా ఒక సిగ్నచర్ వుంది. తన డ్యాన్స్ తో ట్రెండ్ సెట్ చేసి, సినిమా పాటకున్న కమర్షియల్ మీటర్ ని వెయ్యిరెట్లు పెంచి, మెగా మాస్ ఎంటర్టైనర్ గా అభిమానులనే కాదు యావత్ సినీ లోకాన్ని మంత్రముగ్దుల్ని చేసిన కింగ్ అఫ్ డ్యాన్స్ మెగాస్టార్.
* చిరు డ్యాన్స్.. ఎందుకింత స్పెషల్:
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు డ్యాన్సుల్లో చిరంజీవి డ్యాన్స్ వేరు. ఆయన డ్యాన్స్ ని గురు ముఖంగా నేర్చుకోలేదు. ఆయనది జానపదుల నృత్యమే. అయితే నాట్యంలో భరతముని భోదించిన అతి ముఖ్యమైన సూత్రాన్ని బలంగా పట్టుకున్నారు చిరు. అభినయం, నాట్యం కలయికే నృత్యం. తన కెరీర్ బిగినింగ్ నుంచే ఆణువణువునా ఈ సూత్రాన్ని ఆకళింపు చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేకతమైన నృత్య రీతిని తయారు చేసుకున్నారు. అదే ఆయన్ని ట్రెండ్ సెట్టర్ గా నిలిపింది.
* మెగా సుప్రీం సిగ్నేచర్ ట్రెండ్:
ప్రతి సాంగ్ కి కొరియోగ్రఫర్ వుంటారు. వాళ్ళు కంపోజ్ చేసిన మూమెంట్ వున్నది వున్నట్టుగా ఆడితే సరిపోతుంది. కానీ అందులో హీరో స్పెషాలిటీ ఏమిటి? సరిగ్గా ఇక్కడే చిరంజీవి తన సిగ్నేచర్ జోడించారు. అప్పటివరకూ డ్యాన్సులన్నీ లెగ్, హ్యాండ్ మూమెంట్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేసేవి. కానీ చిరంజీవి ఓ కొత్త స్టయిల్ ని పట్టుకున్నారు. తన బాడీ మొత్తాన్ని సాంగ్ బీట్ లో ఇంజెక్ట్ చేశారు. తల, కళ్ళు, కనుబొమ్మలు, మెడ, భుజాలు, నడుం, హిప్, నీస్, యాంకిల్.. ఇలా బాడీలోని ప్రతి కండర కదలికని బీట్ కి తగ్గట్టు గ్రేస్ ఫుల్ కోఆర్డినేషన్ తో ఆడిస్తూ, అద్భుతమైన పుట్ వర్క్ తో ”వీడెవడో డ్యాన్స్ అదరగొట్టేస్తున్నాడ్రాబాబు’ అని ప్రేక్షకుడిని తెరకి అతుక్కుపోయేలా చేసిన డ్యాన్సింగ్ సెన్సేషన్ చిరు.
* ఆ గ్రేస్.. గాడ్ గిఫ్టా?
చిరు డ్యాన్స్ టాపిక్ ఎప్పుడొచ్చినా ‘గ్రేస్’ అనే మాట వాడుతుంటారు అభిమానులు. ఆయన గ్రేస్ గాడ్ గిఫ్ట్ అంటుంటారు. అసలు ఏమిటీ గ్రేస్? ఆయనకి జన్మతహ వరంలా వచ్చిందా? ముమ్మాటికీ కాదు. ఒక డ్యాన్సర్ చేసే మూమెంట్ గ్రేస్ ఫుల్ గా కనిపించాలంటే చాలా క్వాలిటీస్ వుండాలి. ఫిజికల్ స్ట్రెంత్, బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఎవైర్నెస్, రిధమ్, మ్యూజిక్ సెన్స్, క్రియేటివిటీ, ఎక్స్ప్రెషన్.. ఇవన్నీ కలగలిస్తేనే ఒక మూమెంట్ కి గ్రేస్ యాడ్ అవుతుంది. చిరంజీవి వీటన్నిటిపై గొప్ప కమాండ్ సాధించారు. ఇది ఒక్కరోజులో జరిగిపోలేదు. 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనని తాను చెక్కుకుంటూ వచ్చారు. 80, 90, 2000 ఇలా ఒకొక్క దశకానికి ప్రేక్షకులు అభిరుచుకి తగ్గట్టు తన గ్రేస్ లో చాలా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రతి సాంగ్ ని గొప్పగా చేయాలనే నిరంతర తపనే ఆయన్ని గాడ్ అఫ్ డ్యాన్స్ ని చేసింది.
* అది వెన్నుముక? స్ప్రింగా?
సినిమా పాటకి కొత్త కమర్షియాలిటీ తీసుకొచ్చిన ఘనత నిస్సందేహంగా చిరంజీవికే దక్కుతుంది. సినిమా పాటంటే కాసేపు సిగరెట్ కాల్చుకొని వద్దామనుకొనే ఆలోచన ఆడియన్ లో వుండేది. ఇలాంటి ఆలోచనకి తన బ్రేక్ డ్యాన్స్ తో బ్రేక్ వేశారు చిరు. ఆయన డ్యాన్స్ కోసమే రిపీట్ గా ఆడియన్స్ రావడం మొదలైయింది. బ్రేక్ డ్యాన్స్ లతో థియేటర్స్ ని ఉర్రూతలూగించారు. చిరు డ్యాన్స్ లో అందరినీ ఆశ్చర్యపరిచే ఎలిమెంట్ ఆయన బ్రేక్ మూమెంట్. అసలు అది వెన్నుముక? స్ప్రింగా? అనే డౌట్ వచ్చేలా బాడీ షేక్ చేయడం… రియల్లీ మెస్మరైజింగ్.
చిరంజీవి డ్యాన్స్ స్పెషాలిటీ గురించి చెప్పాలంటే ఎన్నో పాటల్ని ప్రస్థావించాలి. ఆరు పాటలు వుంటే అన్నిట్లోనూ తనకే సొంతమైన డ్యాన్స్ మూమెంట్స్ వుంటాయి. ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో వైరల్ డ్యాన్సులు చేసిన ఘనత మెగాస్టార్ ది. మెరుపులా (అత్తకి యముడు అమ్మాయికి మొగుడు), గోలీమార్( దొంగ), హేపాప (త్రినేత్రుడు) పదహారేళ్ళ వయసు (లంకేశ్వరుడు), రూప్ తేరా మస్తానా (రిక్షవోడు), బంగారు కోడిపెట్ట ( ఘరానా మొగుడు) పాప రీటా (గ్యాంగ్ లీడర్), ఇట్స్ ఏ ఛాలెంజ్ (ఆజ్ కా గూండా రాజ్) అబ్బనీ తీయని దెబ్బ(జగదేక వీరుడు అతిలోక సుందరి) చక్కని చుక్కల (పసివాడి ప్రాణం) ఈ పేటకు నేనే మేస్త్రీ(ముఠామేస్త్రీ) నడక కలిసిన (హిట్లర్), ఆట కావాలా(అన్నయ్య), రామ్మా చిలకమ్మ( చూడాలని వుంది), లక్కీ లక్కీ (డాడీ), అంటీ కూతురా(బావగారు బావున్నారా) దాయిదాయి దామ్మ ( ఇంద్ర), మన్మద (ఠాగూర్)… ఈ పాటల్లో మెగాస్టార్ డ్యాన్సులు… ప్రేక్షకుల మనసులో చిరు సంతకాలు.
* మెగా వాక్ :
చిరంజీవి బాడీ లాంగ్వేజ్ లో మాసే కాదు ..గొప్ప మెలోడీ వుంది. వాయిద్యానికి తగ్గట్టుగా ఆయన బాడీని మూవ్ చేసే స్టయిల్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అయితే ఈ క్యాలిటీ కూడా అరంగేట్రంలోనే రాలేదు. ఒకొక్క సినిమాకి మెరుగుపరుచుకుంటూ వచ్చారు. మొదట వాకింగ్ స్టయిల్ లో మార్పులు చేశారు. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి నడకకి, పసివాడి ప్రాణంలో నడకకి చాలా తేడా ఉంటుంది. ఊరకలై గోదావరి, అందం శరణం.. ఈ రెండు పాటలు దాదాపు ఒకటే మూడ్ లో సాగుతాయి. ఈ రెండు పాటల్లో వాకింగ్ మూమెంట్స్ వుంటాయి. ఊరకలై గోదావరి సాంగ్ పుట్ వర్క్ కి, అందం శరణం సాంగ్ పుట్ వర్క్ కి చాల తేడా వుంటుంది, అందం శరణం పాట దగ్గరకి వచ్చేసరికి ఆయన వాకింగ్ స్టయిల్ బీట్ కి తగ్గట్టుగా భలే సుకుమారంగా వుంటుంది.
* మెలోడీ మాస్టర్:
వాకింగ్ స్టయిల్ లోనే ఇంత శ్రద్ద తీసుకున్న చిరు మెలోడీకి వచ్చేసరికి ఆ పాటలోని సంగీతం, సాహిత్యంలో లీనమైపోయి డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. లిరిక్, అందులో వుండే భావాన్ని మనస్పూర్తిగా ఉచ్ఛరించడానికి ఇష్టపడతారు చిరు. తన పక్కన హీరోయిన్ వుందనే స్పృహ వుంటుంది, మూమెంట్ ని పర్ఫెక్ట్ గా చేస్తూనే హీరోయిన్ తో ఐకాంటాక్ట్ ని ఎక్స్ చేంజ్ చేయాలి, వచ్చిన ఎక్స్ ప్రెషన్ ని రియాక్షన్ ఇవ్వాలి.. ఇవన్నీ కనులు మూసి తెరిచేలోగా రిధమిక్ గా జరగాలి. మిగతా డ్యాన్సర్స్ కి చిరంజీవి కి ఇక్కడే తేడా వుంటుంది. చాలా మంది డ్యాన్సర్స్ మూమెంట్ మీద ఫోకస్ చేసి రిధమ్ ని కోల్పోతారు. ఇంకొందకి ఎక్స్ ప్రెషన్ పోతుంది, మరికొందరికి ఫుట్ వర్క్ దెబ్బకొట్టేస్తుంది. కానీ చిరంజీవికి ఈ సమస్యలు లేవు. పాట శ్రుతిలోకి తన బాడీని భలే ట్యూన్ చేసేస్తారు. ?శుభలేఖ రాసుకున్న, కోలో కోలమ్మ, అచ్చా అచ్చా, ఔరా అమ్మకు చెల్లా, అబ్బనీ తియ్యని, అబ్బాబ్బా ఇద్దు, వాన వల్లప్పా, సిగ్గుతో చీచీ, మెల్లమెల్లగా…? ఇలా అనేక మెలోడీస్ మెమరబుల్ గా మారిపోవడానికి ప్రధాన కారణం మెగా గ్రేస్ ఫుల్ మూమెంట్స్. ఓ పాటని చిరంజీవి ఎంజాయ్ చేసేంతగా మరో హీరో చేయలేడు. ఆకలిగా ఉన్నప్పుడు ఇష్టమైన కూరలతో విందు భోజనం వడ్డిస్తే.. ఎంత ప్రేమగా తినాలనిపిస్తుందో పాటని అంత ఇష్టంగా, ప్రేమగా ఆరగిస్తారు చిరంజీవి.
* ది బెస్ట్ కార్డ్ ప్లేయర్:
చిరంజీవి డ్యాన్స్ స్పెషాలిటీలో చెప్పాల్సిన మరో క్యాలిటీ కార్డ్ ప్లేయింగ్. ఇది బేసిగ్గా కంపోజర్స్ కి సంబంధించిన టాపిక్. వెస్ట్రన్ మ్యూజిక్ లో ప్రతి సాంగ్ కార్డ్స్ బ్యాకింగ్ తో వుంటుంది. కొంచెం మ్యుజికాలిటీ వున్న వాళ్ళకి ఈ కార్డ్ సెన్స్ తెలుస్తుంది. మెగాస్టార్ కి కార్డ్స్ విషయంలో మంచి పట్టువుంది. ఒక పాట హిట్టైన తర్వాత ఆ కార్డ్స్ ప్యాట్రన్ లో పాటలని చేయించేవారు. ఆ కార్డ్స్ లో వుండే హర్మనీ, మూమెంట్ ని తన బాడీలాంగ్వేజ్ తో చాలా ఎలిగెన్స్ తో పెర్ఫార్మ్ చేస్తారు. రాజ్ కోటి, చిరుకి ఇలాంటి మాంచి కార్డ్ ప్రొగ్రసన్ వుండే డ్యాన్స్ బీట్ చేసి పాపులర్ అయ్యారు. దీని తర్వాత మణిశర్మ ఆ ట్రెండ్ ని కొనసాగించారు.
అలాగే స్ట్రింగ్ వాయిద్యానికి ఆడటంలో మెగాస్టార్ కి తిరుగులేదు. ఆయన నడుం తీగలా కడులుతుంది. అది ఆయనకి బిగ్గెస్ట్ ఎసెట్. ముఠామేస్త్రీ, దాయిదాయి దామ్మా, నడక కలిసిన..ఇలా ఎన్నో సిగ్నేచర్ స్టెప్స్ ఆ ఫ్లెక్సిబిలిటీతోనే సాధించారు. రీఎంట్రీలో కూడా ఆయన గ్రేస్ తగ్గలేదు. ఆయనది ‘రా’ ట్యాలెంట్ కావడంతో ప్రాక్టీస్ లో గ్యాప్ వచ్చిన స్టయిల్ లో ఇబ్బంది రాలేదు. లెట్స్ డు కుమ్మడు అంటూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొట్టేస్తున్నారు.
* గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్:
చిరంజీవి డ్యాన్స్ ని దశాబ్దాలుగా ఎంజాయ్ చేసినవారిలో ఎక్కడో చిన్న వెలితి వుండేది. మంచి డ్యాన్సర్, బెస్ట్ డ్యాన్సర్.. ఇలా రెగ్యులర్ గుర్తింపులేనా.. అంతకుమించి ఇంకేం లేదా? అని భావిస్తున్న తరుణంలో ఫ్యాన్సే కాదు మెగాస్టార్ కూడా ఊహించిన ఓ అవార్డ్ వచ్చింది. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరు పేరు చేరింది. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. నిజంగా ఇది చిరంజీవి డ్యాన్స్ ప్రతిభకి దక్కాల్సిన గౌరవం. ఆయన డ్యాన్స్ కి తగిన గుర్తింపు ఇది. 56 చిత్రాలు.. 537 పాటలు.. 24వేల స్టెప్పులు.. ఇప్పుడున్న ఈక్వేషన్ ప్రకారం భవిష్యత్ లో ఎవరూ టచ్ చేయలేని రికార్డ్ ఇది. ఏ వెరీ బిగ్ కంగ్రాట్స్ టు మెగాస్టార్.