అందరూ ఊహించినట్లుగానే తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానంపై చర్చ పేరిట అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా చాలా అసందర్భంగా, అనుచితంగా తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణలు చేసుకొంటూ రాత్రి 9.30 గంటల వరకు సభను కొనసాగించిన తరువాత, ఇంకా వారి వాదోపవాదాలు కొనసాగుతుండగానే స్పీకర్ కోడెల శివప్రసాద రావు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేప్పట్టారు. ఊహించినట్లుగానే అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని, ఇంక దానిపై సభలో చర్చ ముగిసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తరువాత రాష్ట్ర బడ్జెట్ పై చర్చ మొదలుపెట్టాలని సభ్యులకు సూచించారు.
అప్పుడు సభలో ఊహించని పరిణామం జరిగింది. వైకాపా ఎమ్మెల్యేలు డివిజన్ కావాలని, తీర్మానంపై మళ్ళీ ఓటింగ్ జరగాలని పట్టుబట్టారు. కానీ స్పీకర్ అందుకు అంగీకరించలేదు. వైకాపా సభ్యులు బడ్జెట్ పై చర్చకు సిద్దం కాకపోవడంతో, స్పీకర్ కోడెల ప్రభుత్వ విప్ కె.రవి కుమార్ కి బడ్జెట్ పై చర్చ మొదలుపెట్టేందుకు అనుమతించారు. చర్చ మొదలయిన కొద్ది సేపు తరువాత సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.