వీగిపోతుందని తెలిసినా ప్రతిపక్షాలు- అవిశ్వాస తీర్మానాలు పెట్టడం అనేది చరిత్రలో కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. కానీ.. వరుసగా రెండు రోజుల్లో ఒకరోజు ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టి వీగిపోయిన తర్వాత.. ఆ వెంటనే.. రెండోరోజు స్పీకరు మీద కూడా అవిశ్వాసం పెట్టడం (ఇది కూడా వీగిపోతుందని ఖచ్చితంగా తెలిసినప్పటికీ) బహుశా చరిత్రలో ఇదే ప్రప్రథమం కావొచ్చు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వెరైటీ అవిశ్వాసాల మేళా నిర్వహిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నది. మంగళవారం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే.. ఏపీ స్పీకరు కోడెల శివప్రసాదరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు.
స్పీకరు కోడెల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ప్రత్యేకించి.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో మూజువాణీ ఓటుతో వీగిపోయినట్లు ప్రకటించడం, అలాగే వైకాపా డివిజన్ కోరినా ఇవ్వకపోవడం అనే అంశాలను వైకాపా సభ్యులు స్పీకరు ఏకపక్ష ధోరణికి నిదర్శనాలుగా ప్రకటిస్తున్నారు. అధికార పక్ష సభ్యులు అడగకపోయినా కూడా వారిలో ఎక్కువ మంది మాట్లాడేందుకు, ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
స్పీకరు కోడెలపై అవిశ్వాసం పెట్టడం వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. నిన్న ప్రభుత్వంపై అవిశ్వాసం ద్వారా వారేం సాధించగలిగారో.. దాని తరువాయి భాగాన్ని మాత్రమే స్పీకరు పై అవిశ్వాసం ద్వారా సాధించగలరు. అంటే.. ఈ అవిశ్వాసం కూడా వీగిపోవడం అనేది గ్యారంటీనే! కాకపోతే.. అవిశ్వాస తీర్మానం మీద చర్చ అనే రూపేణా.. స్పీకరు పనితీరు మీద ఎడాపెడా నిందలు వేయడానికి వారికి వీలు చిక్కుతుంది. అంతకు మించి ప్రత్యేకంగా సాధించేదేమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.