చిన్నారి పెళ్లి కూతురుగా అలరించింది అవికాగోర్. బుల్లి తెరపై అవికా ప్రతిభాపాటవాలకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో అరంగేట్రంలోనే అదరగొట్టేసింది అవికా. సినిమా చూపిస్త మావతో మరో హిట్ ఆమె ఖాతాలోకి మళ్లింది. దాంతో తెలుగు సినిమాకి మరో మంచి హీరోయిన్ దొరికేసింది అని మురిసిపోయారు. అయితే ఇప్పుడు అవిక ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే అవిక సినిమాల్ని మానేస్తుందట. తన దృష్టి పూర్తిగా సినిమాల నుంచి బుల్లి తెరపై మళ్లిస్తుందట. సినిమా వల్ల ఇప్పటికీ కొన్ని సీరియల్స్ ని పక్కన పెట్టాల్సివచ్చిందట. అంతేకాదు…తనకు విరామమే లేకుండా పోయిందట. అందుకే… ప్రస్తుతం ఒప్పుకొన్న చిత్రాల్ని పూర్తి చేసి, ఇక వెండి తెరకు గుడ్ బై చెప్పాలనుకొంటుదని సమాచారం. ఎవరైనా బుల్లి తెరనుంచి వెండి తెరకు వస్తే.. సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ అవికా మాత్రం రివర్స్ స్ట్రాటజీని ఫాలో అవుతూ అందరికీ షాక్ ఇస్తోంది. ”నా తొలి ప్రాధాన్యం టీవీకే. ఆ తరవాతే సినిమాలు. సినిమాల వల్ల నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే సినిమాలకే దూరమవ్వాలనుకొంటున్నా” అంటోంది అవిక.