తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్లో ఆదాయ వ్యయాలకు సంబంధించి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. ప్రణాళికా వ్యయం అధికంగా చూపించడం మంచి లక్షణమే గాని అప్పులను అమితంగా పెంచడం సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది పరిమితంగా చేసిన కేటాయింపులే సగమైనా ఖర్చు చేయనప్పుడు ఈ ఏడాది మరింత భారీగా చూపినవి నిజంగా ఖర్చు చేస్తారా అన్న సందేహాలు కూడా వచ్చాయి. ఆ వాదోవవాదాలు పక్కనపెడితే రాజేందర్ బడ్జెట్ ప్రసంగంలో రాజకీయ రాగాలు అధికంగానే వినిపించాయి. ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలు ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ తదితరులు వినిపించిన సుహృద్భావం స్థానే మళ్లీ విభజన ఉద్యమ కాలంనాటి పలు విమర్శలు విసుర్లు ముందుకు తెచ్చారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేశారన్న విమర్శ ఎలాగూ వుంటుంది కాని ఆయన అంతటితో ఆగలేదు. పాలన చేతకాదన్నారని కాని చేసి చూపించామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సమర్థతను గాని సంసృతిని గాని సంస్కారవంతులైన వారెవరూ అగౌరవపరచరు. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడి వుంటే అది వారి వ్యక్తిగతం తప్ప ఇరుప్రాంతాల ప్రజలకూ పార్టీలకూ సంబంధం లేని విషయం. కనుక పదే పదే వాటిని ప్రస్తావించుకోవడం వల్ల కలిగే ప్రయోజనం లేదు. తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రం అని నొక్కి వక్కాణించారు. భారత దేశాన్ని పేదలతో కూడిన ధనిక దేశం అంటారని ఆయన గుర్తుంచుకోవాలి. సంపదలు సామాన్యులకు సమ పంపిణీ జరగడం సమస్య తప్ప వుండటం లేకపోవడం కాదు. ఆయన రాజకీయ వ్యక్తిగత నేపథ్యం దృష్యా ఆ సామాజికన్యాయ భావన కోసం కృషి చేయడం జరగాలి. ఆయన పేర్కొన్న కౌటిల్యుడు ఆ తరహాకు చెందిన వారు కాదు మరి. బడ్జెట్ ప్రసంగంలో కెసిఆర్‌ను అమితంగా పొగిడారు సరే గాని కెటిఆర్‌ను కూడా ప్రశంసించడం మరో విశేషం.