రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది. తన సస్పెన్షన్ వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టులో కేసు విచారణ సందర్భంగా మంగళవారం నాడు ఢిల్లీలో ఉన్న రోజా.. కోర్టు తీర్పు అనంతరం.. సభలో జరుగుతున్న సస్పెన్షన్ వ్యవహారాలపై పలు సెటైర్లు వేశారు. నిరసన తెలియజేశారు. అయితే తమాషా ఏంటంటే.. రోజా వేసిన సెటైర్లు వారి సొంత పార్టీ వైకాపాలోని సభ్యులకు కూడా తగిలేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సుప్రీం తీర్పు అనంతరం రోజా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం విపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదంటూ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇందులో కొత్తదనం ఎంతమాత్రమూ లేదు. ఆ పార్టీ మొత్తం ఇలాంటి వాదనల్నే పలు సందర్భాల్లో వినిపిస్తూనే వస్తున్నది. అసలు ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని చూస్తున్నదని, అందుకు కుట్ర చేస్తున్నదని, పార్టీకి చెందిన నాయకులందరూ కూడా వేర్వేరు సందర్భాల్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే రోజా తన సస్పెన్షన్‌ను ప్రస్తావిస్తూ విపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నదని ఆపాదించడం గమనార్హం. రోజా మాట్లాడుతూ నిన్నటికి నిన్న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. జగన్మోహనరెడ్డి మాటలను అడ్డుకుంటూ జగన్ మీద కూడా సస్పెన్షన్ వేటు వేయాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేయడాన్ని ఆమె ప్రస్తావించారు.
అయితే ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలని చూస్తున్నారని, తమ మాటలకు తలాడిస్తూ కూర్చునే వారిని మాత్రమే సభలో ఉంచాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజానికి మూకుమ్మడిగా పార్టీ అందరి మీద సస్పెన్షన్ పడ్డ సందర్భాల్లో తప్ప.. వేటు పడేంతగా సభలో రెచ్చిపోకుండా మాట్లాడుతున్న వైకాపా సభ్యులు కూడా చాలా మందే ఉన్నారు. ప్రభుత్వానికి సొంత పార్టీ మీద సస్పెన్షన్ ఊసు ఉండదు గనుక.. ”మాటలకు తలాడించే వారిని మాత్రం ఉంచుతున్నారు” అని రోజా అనడంలో.. వైఎస్సార్ కాంగ్రెస్‌లోని మితవాదుల మీద కూడా సెటైర్ ఉన్నదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశంలోకి ఫిరాయించే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలుకొందరు, ఆ ఆలోచన లేకపోయినా, ప్రభుత్వంపై కత్తులు దూయడంలో అంత దూకుడు ప్రదర్శించని ఎమ్మెల్యేలు కొందరు విపక్షంలోనూ ఉన్నారు. రోజా చేసిన ఈ తాజా వ్యాఖ్యలు అలాంటి వారికి తగుల్తాయనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.