రాజకీయం అంటే పిల్లల ఆట కాదు. అందునా, ఈనాటి భారతీయ రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే ఎంతో మానసిక పరిపక్వత ఉండాలి. వ్యూహ చతురత ఉండాలి. రాబోయే సవాలును ముందే ఊహించి, కౌంటర్ అటాక్ కు సిద్ధపడే దూరదృష్టి ఉండాలి. అన్నింటికీ మించి, తన మీద తనకు విశ్వాసం ఉండాలి.
వైసీపీ అధ్యక్షుడు జగన్ లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అనేది ఆ పార్టీ వాళ్లకు తెలిసే ఉంటుంది. అసలు తన మీద తనకు విశ్వాసం ఉందో లేదో అనే అనుమానం చూసే వారికి కలుగుతుంది. అందుకేనేమో, అవిశ్వాస యాత్ర చేపట్టినట్టున్నారు. మొదట ప్రభుత్వం మీద, తర్వాత స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం. ఈ సందర్భంగా అరుపులు కేకలు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు షరా మామూలే. అధికార, ప్రతిపక్ష సభ్యులు కొందరు పోటీ పడి దబాయింపు ప్రసంగాలు చేశారు. ఆ తీర్మానాలు వీగిపోతాయని అందరికీ తెలుసు.
తన తండ్రిపై మెజారిటీ ప్రజల్లో అభిమానం ఉప్పొంగుతోందనే ఉద్దేశంతో సొంత పార్టీ పెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు తన విజయానికి గ్యారంటీ కార్డ్ అవుతుందని ఆశపడ్డారు. చివరకు నిరాశే మిగిలింది. రేపో మాపో సీఎం అయిపోతానని ఆత్రంగా ఎదురు చూశారు. ఆయన పార్టీలోని కొందరు నాయకులైతే ఎవరికి ఏ మంత్రి పదవి అనే లెక్కలు కూడా వేశారు. చివరకు అన్నీ తుస్సుమన్నాయి. ప్రజలు చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టారు. జగన్ కు ప్రతిపక్ష హోదా చాలని తీర్పు చెప్పారు. దీన్ని జీర్ణించుకోవడానికి ఆయనకు చాలా కాలమే పట్టినట్టుంది.
కాలం గడిచే కొద్దీ జగన్ లో అసహన పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం సడలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2014లోనే తన తండ్రి పథకాలు గెలిపించలేక పోయాయి. 2019 నాటికి ఆ పథకాల్లో చాలా వరకు మరుగున పడిపోవచ్చు. ప్రజలకు గుర్తుండక పోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం తెచ్చే పథకాలు జనంనోళ్లలో నానవచ్చు. అలాంటి సమయంలో విజయం సాధ్యమేనా అనే అనుమానం ఆయనలో ఉండొచ్చు. పోనీ, తనను చూసి, తన పార్టీ నిబద్ధతను చూసి ఓటు వేస్తారా అంటే అది కూడా అనుమానమే. రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే మెచ్చుకున్న సందర్భాలు లేవు. ఎప్పుడు చూసినా రాజధాని నిర్మాణానికి బద్ధ వ్యతిరేకి అనే తరహాలో మాట్లాడటం మేలు చేసే అవకాశం లేదు.
రాజధాని నిర్మాణానికి జగన్ వ్యతిరేకి అని ముద్ర వేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. అందుకు ఆయన ప్రవర్తన కూడా దోహదపడింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణ జరపుతుంటే దానికి అడ్డుపడే ధోరణిలో వ్యవహరించారు. చాలా మంది రైతులు భూ సమీకరణకు సహకరిస్తుంటే ఆ పద్ధతిని పదే పదే విమర్శించారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ప్రతిపక్షం ఎత్తి చూపాలి. పథకాలు సరిగా అమలు కావడానికి అవకాశం ఇవ్వాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సమర్థంగా పనిచేస్తే, రేపు అధికారంలోకి వస్తే అదే నిబద్ధతతో పనిచేస్తారనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. అలాంటి ప్రయత్నమేదీ ఆయన చేసినట్టు కనిపించదు. తనకు నచ్చని వారంతా చెడ్డవారే అని ఆయన అనుకుంటే పరవాలేదు. లోకమతా అలాగే అనుకోవాలి, తాను అనుకున్న ప్రకారమే అన్నీ జరగాలంటే కుదరదు.
అసెంబ్లీలోనూ అదే ధోరణితో ఉంటే అధికార పార్టీ చాణక్యం ప్రదర్శిస్తుంది. ఆయన ప్రయత్నాలను తిప్పికొడుతుంది. ఊహించని ఎత్తులతో చిత్తు చేస్తుంది. ఇవన్నీ తట్టుకోలేక, ఆయనలో అసహనం పెరుగుతోంది. అదే అసహనంలో వ్యూహాత్మక తప్పిదాలను చేస్తున్నట్టు కనిపిస్తోంది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం చాలా పెద్ద విషయం. తీరా దాని వల్ల సాధించింది ఏమిటో అర్థం కాదు. వైసీపీ వ్యూహ బృందం ఇలాంటి సూచనలు ఎలా ఇస్తుందో, అసలు అలాంటి వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియని స్థితి. ఆయన వైఖరితో వేగలేకే ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆత్మవిమర్శ ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకుంటారో లేదో ఆయన ఇష్టం. తన మీద తనకే అవిశ్వాసం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం పారిపోతుంది. రాజకీయ ప్రత్యర్థులు దాడి చేయడం సులువు వుతుంది. వ్యూహాత్మకంగా దెబ్బతీయం ఈజీ అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.