రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఏపీ విషయంలో చాలా వరకు అమలయ్యాయి. తెలంగాణ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే అభిప్రాయం తెరాస నేతల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం లోక్ సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏపీకి మంజూరు చేసిన సంస్థలు, నిధులకు సంబంధించి పెద్ద జాబితా చదివి వినిపించారు. మరి మా రాష్ట్రానికి మంజూరు చేయని వాటి పరిస్థితి ఏమిటని తెరాస సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రశ్నించారు.
స్మార్ట్ సిటీస్ విషయంలో కొంత అయోమయం ఏర్పడింది. హైదరాబాదును ఈ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కేంద్రాన్ని కోరింది. దానికి బదులు కరీంనగర్ ను చేర్చాలని సూచించింది. మొదటి విడత 20 స్మార్ట్ సిటీస్ నిధులను పొందడానికి నగరాల మధ్య పోటీ ఉంటుందని కేంద్రం ముందే చెప్పింది. ఆ పోటీలో ఒక్క పాయింటుతో వరంగల్ అవకాశం కోల్పోయింది. కాబట్టి రెండో విడతలో దానికి అవకాశం వస్తుంది. దీన్ని కేంద్రం ఉద్దేశ పూర్వకంగా చేసిందని కేసీఆర్ చేసిన ఆరోపణలో నిజం లేదు. ప్రధాని ప్రాతినిధ్యం వహించే వారణాసి కూడా పోటీలో వెనకబడటం వల్ల తొలి 20 నగరాల జాబితాలో చోటు పొందలేదు.
అయితే మిగతా విషయాల్లో మాత్రం కేంద్రం తెలంగాణ పట్ల వాస్తవిక దృక్పథంతో సహాయం చేయడం లేదనే అభిప్రాయం ఉంది. జాతీయ రహదారుల విషయంలో కొంత సానుకూల వైఖరే కనిపిస్తోంది. ఇంతకీ హైకోర్టు విభజన ఎప్పుడు అంటే ప్రాసెస్ కొనసాగుతోందని చెప్పడం పరిపాటిగా మారింది. రెండేళ్ల తర్వాత కూడా ఈ పని పూర్తి కాలేదంటే తెరవెనుక ఏదో జరుగుతోందని జితేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలాగే గతంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాలకు కొన్ని నెలల్లోనే ప్రత్యేక హైకోర్టులు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. మరి ఈ విషయంలో ఇంత జాప్యం ఎందుకని తెరాస ప్రశ్నిస్తోంది. చిలక పలుకులు పలికినట్టు ప్రతిసారీ ప్రాసెస్ నడుస్తోందని చెప్పడం కేంద్రానికి మంచిది కాదు.
హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయ్యే స్థాయిగల గొప్ప నగరం. స్మార్ట్ సిటీ వద్దంటే వద్దన్నారు, మరో విధంగా చేయూతనిస్తే ఈ నగరం మరెన్నో పరిశ్రమలకు స్వాగతం పలుకుతుంది. ఎంతో మందికి ఉపాధినిస్తుంది. కేంద్రం ఈ విషయంలో చొరవ చూపుతుందని తెలంగాణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.