మొత్తానికి ఏపీసీసీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం గురించి రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరించే కార్యక్రమానికి ‘మమ’ అనిపించారు. కోటి సంతకాలూ సేకరించేశాం అని వారు ప్రకటించేశారు. రాష్ట్రంలో అయిదు కోట్ల జనాభా ఉన్నదని అనుకున్నప్పటికీ.. ప్రతి అయిదుగురిలో ఒకరికి వీరు సేకరించిన సంతకాల గురించి సమాచారం ఉండి ఉండాలి. అయితే ఆ రాష్ట్రంలో అలాంటి వాతావరణం మాత్రం లేదు. ఏపీసీసీ సేకరించిన కోటి సంతకాల గురించి మనం ఏ ఊర్లో ఎవ్వరిని పలకరించినా.. తాము సంతకం చేసినట్లు ఎందరు చెప్పగలరో సందేహమే! ఏదైతేనేం సంతకాల పర్వం ఇంకా నెత్తిన పెట్టుకుని శ్రమవ్యయాలకు లోనుకాకుండా ‘అయిపోయింది’ అని నాయకులు ప్రకటించేశారు. వాటిని తీసుకువెళ్లి రాష్ట్రపతికి కూడా ఇచ్చేశారు. ఇవాళ సోనియాకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని మోడీకి కూడా నీళ్లు, మట్టితో సహా దీన్ని కూడా ఇవ్వాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం గురించి వారు పడుతున్న పాట్లపై జాలి కలుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేసిందని, దాన్ని ప్రస్తుత ఎన్డీయే సర్కారు తొక్కిపెడుతున్నదని, వారినుంచి దాన్ని సాధించడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని… ఏపీ ప్రజల్ని నమ్మించడం పీసీసీ తొలి లక్ష్యంగా ఉంది. అయితే అందుకు ఢిల్లీ పెద్దలనుంచి వారికి లభిస్తున్న మద్దతు మాత్రం సున్నా!
రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి నోటీసు ఇవ్వడంలో గులాం నబీ ఆజాద్ కూడా ఒక చేయి వేయడం మినహా.. ఢిల్లీ పెద్దలనుంచి వారికి ఎలాంటి మద్దతు లభించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… ఢిల్లీ పెద్దలు కూడా దానికి కలసి రావాలి.
ఇవాళ హస్తినలో ఓ కామెడీ ఎపిసోడ్ జరిగింది. ఏపీసీసీ నేతలంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, మన్మోహన్‌లను ఏఐసీసీ కార్యాలయంలో కలిసి తాము సేకరించిన కోటి సంతకాలు వారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వారంతా .. ఏపీకి హోదా ఇచ్చి న్యాయం చేయాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. భాజపా హోదా ఇస్తుందన్న నమ్మకం తమకు లేదని మన్మోహన్ అంటే.. ‘సాధిస్తాం… సాధిస్తాం’ అంటూ సోనియా నినదించారు. ఏపీ ప్రయోజనాలు కాపాడడానికి కట్టుబడి ఉన్నాం అంటూ రాహుల్ కూడా భీషణ ప్రతిజ్ఞ చేశారు.
అంతా బాగానే ఉంది. ఏపీసీసీ నాయకులు వెళ్లి కలిసినప్పుడు మాత్రమే కురుస్తున్న ఈ ప్రేమ ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది. రాష్ట్రపతిని ఏపీసీసీ నాయకులు వెళ్లి కలిసినప్పుడు.. వారి వెంట సోనియా గానీ, రాహుల్ గానీ, రాజ్యసభ సాక్షిగా హామీ ఇచ్చిన అప్పటి ప్రధాని మన్మోహన్ గానీ ఎందుకు వెళ్లలేదు. రాష్ట్రపతితో మన్మోహనే గనుక స్వయంగా నాడు తాను ఇచ్చిన హామీ గురించి, ఇప్పటి ప్రభుత్వం విస్మరిస్తున్న తీరు గురించి చెప్పి ఉంటే దాని ఫోకస్ ఇంకా బాగుండేది కదా..! అనేది పలువురి వాదన. కాంగ్రెస్‌కు నిజంగానే ఏపీ మీద చిత్తశుద్ధి ఉంటే గనుక.. ఏపీ నాయకులు వచ్చినప్పుడు వారి ఎదుట ఏదో కాసింత నాటకం నడిపించడం కాదు..! వారి వెంట నిలిచి పోరాడాలి, వారి పరోక్షంలో కూడా ఏపీ కోసం పోరాడాలి. అలా కాకుండా.. ఇలా ఆపద్ధర్మపు రాజకీయ జిమ్మిక్కులు ప్రదర్శించినంత కాలమూ వారికి మన్నన ఉండదని తెలుసుకోవాలి.